న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లిలో గాలి నాణ్యత మరింత క్షిణించింది. దీంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నియంత్రణకు మరిన్ని ఆంక్షలు విధించింది. సోమవారం ఉదయం ఢిల్లీలో చాలా చోట్ల వాయు నాణ్యత సూచి 481కి చేరిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఢిల్లీలో ఇవ్వాల్టి నుంచి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి స్టేజ్-4 ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. చిన్న పిల్లలు, వృద్ధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారు బయట తిరగవద్దని సూచించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో నేటి నుంచి ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధిస్తూ నిత్యావసర సేవలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
ఢిల్లీలో అన్ని రకాల నిర్మాణాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ.. రాష్ట్రంలో రిజిస్టేషన్ ఉన్న తేలికపాటి వాణిజ్య వాహనాలు, బీఎస్-4, పాత డీజిల్ రవాణా వాహనాలకు ప్రవేశాన్ని నిషేదించింది. ఢిల్లీలో అన్ని రకాల నిర్మాణాలు తాత్కాలికంగా నిలిపివేయాలని, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు బోధించాలని, ప్రభుత్వ కాలేజీలను మూసివేయాలని, సరి-బేసి వాహన నిబంధన అమలుపై నిర్ణయం తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ప్రబుత్వ కార్యాలయాలన్ని 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు జారీ చేసింది. వాయుకాలుష్యం, గాలి నాణ్యత పెంపుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.