అవిశ్వాస తీర్మానంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ
రాజేంద్రనగర్, మే 16 : రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట్ మండలం నార్సింగి మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో నార్సింగి మున్సిపాలిటీలో అవిశ్వాసం రచ్చ మొదలైంది. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాణానికి ముహూర్తం ఈ నెల 18వ తేదీన ఖరారు కావడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మాణం పెట్టాలని కోరారు. దీంతో ఈ నెల 18న అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరిపేందుకు సమావేశాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు గోవా ట్రిప్‌కు వెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ చైర్మన్‌ను ఎలాగైనా గద్దె దింపాలని అంచనాలు వేస్తున్నారు. మొత్తం 18మంది కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఉండగా, 12మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉండగా కౌన్సిలర్ పత్తిప్రవీణ్ కాంగ్రెస్‌లో చేరడంతో 13మంది కౌన్సిల్ సభ్యులు అయ్యారు. దీంతో అవిశ్వాసానికి కావాల్సిన 13మంది మెజార్టీ సరిపోయింది. ఈ మేరకు సమావేశానికి నేరుగా గోవా నుంచే వచ్చి హాజరయ్యేలా పావులు కదుపుతున్నారు. 18వ తేదీన అవిశ్వాస తీర్మాణం నెగ్గుతుందో లేదో తెలనుంది.