calender_icon.png 1 November, 2024 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడిని తగ్గించే రూఫ్ టైల్స్

12-05-2024 01:59:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి): వేసవి ఆరంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. నగరంలో కొద్ది రోజుల కిందటి నుంచి 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మున్మందు పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో ఫ్యాన్లు, ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలు లేనివారు ఉక్కపోతకు, ఎండ వేడికి తాళలేక సతమతమవుతున్నారు. అయితే ఇంటి పైకప్పుపై వేడిని తగ్గించేందుకు గతంలో కూల్ రూఫ్ పెయింట్ వంటి మార్గాలు అందుబాటులో ఉండగా.. తాజాగా కూల్ రూఫ్ టైల్స్ అందుబాటులోకి వచ్చాయి. 

నగరంలోని ఇండిపెండెంట్ ఇండ్లపై వీటి వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం ఇండ్ల శ్లాబులను కాంక్రీట్‌తోనే వేస్తుండటంతో ఇండ్లలో ఉక్కపోత పెరుగుతుంది. కూల్ రూఫ్ టైల్స్ డాబాపై వీటిని వేయించడం ద్వారా లోపల వేడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా సూర్యకిరణాలు శ్లాబ్‌పై పడి.. ఆ వేడి లోపలకు వస్తుంది. కానీ ఈ కూల్ రూఫ్ టైల్స్ వేసుకుంటే పైకప్పుపై పడిన సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయని, దీంతో ఇంట్లో వేడి తగ్గుతుందని నిపుణులు 

పేర్కొంటున్నారు. 

8 డిగ్రీల వరకు తగ్గుదల..

సాధారణ కాంక్రీట్ శ్లాబు ఇండ్లతో పోలిస్తే కూల్ రూఫ్ టైల్స్ ఏర్పాటు చేసిన ఇండ్లలో ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీలు, పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో సాధారణం, యాంటీ స్క్విడ్ మ్యాట్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. కోరుకున్న రంగులలో, నచ్చిన డిజైన్లతో ఇవి లభిస్తున్నాయి. అయితే తెలుపు రంగు టైల్స్ అయితేనే మంచిదని, వీటిలో సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ (ఎస్‌ఆర్‌ఐ) 90 కంటే ఎక్కువగా ఉంటుందని, మిగిలిన రంగుల టైల్స్ ఎస్‌ఆర్‌ఐ 75 నుంచి 90 లోపు ఉంటుంది.

అయితే ఎస్‌ఆర్‌ఐ ఎంత ఎక్కువగా ఉంటే ఇంట్లోకి వచ్చే వేడి అంతమేర తగ్గుతుందని టైల్స్ ఎక్స్‌ఫర్ట్స్ పేర్కొంటున్నారు. కూల్ రూఫ్ టైల్స్ ధరలు చదరపు అడుగుకు రూ. 60 నుంచి మొదలవుతుండగా, వీటిని అమర్చేందుకు చదరపు అడుగుకు రూ.60 వరకు తీసుకుంటున్నారు. ఈ కూల్ రూఫ్ టైల్స్‌ను ఒకసారి ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. టైల్స్ నాచు పట్టకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే మరింతకాలం మన్నుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.