25 May, 2026 | 1:29 AM

వేం నరేందర్ రెడ్డికి ఆత్మీయ సన్మానం

25-05-2026 01:08 AM

పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 

హనుమకొండ, మే 24 (విజయక్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారి ఆత్మీయ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలం దరూ వేం నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి లేకుంటే జిల్లాకు సగం నిధులు కూడా వచ్చేవి కావని అన్నారు.

గతంలో దుర్మార్గుల చేతిలో ఇరవై ఏళ్ల అభివృద్ధి వెనక్కు పోయిందని విమర్శించారు. అయితే రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా నుంచి కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, కరీంనగర్ వంటి పెద్ద నాయకులు ఉన్న జిల్లాల్లో కూడా సాధించని స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారని, అదే తరహాలో వరంగల్ జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి భవిష్యత్తులో సముచిత గౌరవం, పదవులు కల్పించాలని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రావడంలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని వెల్లడించారు.

ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఓరుగల్లు అభివృద్ధిపై వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రేటర్ వరంగల్ అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన సమయం కేటాయించి పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంలో వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాను ఏకతాటిపై నడిపి కీలక పాత్ర పోషించారని తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సహకరిస్తున్నారని కొనియాడారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వేం నరేందర్ రెడ్డి ఉండటం ఓరుగల్లు అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ తన కుమార్తె కడియం కావ్య రాజకీయ ప్రయాణానికి తొలి అడుగులు వేయించిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డేనని చెప్పారు. ఎంపీ సీటు రావడంలో, గెలుపులో ఆయన సహకారం కీలకమని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మతాల పేరుతో అంబేద్కర్ ఆశయాలను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షుడు, కూడా చైర్మన్  వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్ నగరాలను ఏకీకృత దృక్పథంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు వేం నరేందర్ రెడ్డి సహకారం మరింత అవసరమని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మంచికి ఓపిక, తప్పు జరిగితే ఆగ్రహం చూపే స్వభావం వేం నరేందర్ రెడ్డిదని అన్నారు.  మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అప్పట్లో చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరిం చేవారని, టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడకుండా చూసేవారని గుర్తుచేశారు. కానీ వేం నరేందర్ రెడ్డి మాత్రం ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడేవారని చెప్పారు. 

 రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ కార్యకర్తల పోరాట ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా అనేక ప్రాంతాల్లో తనను అభిమానించే ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడామని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా స్వేచ్ఛాయుత పాలన అందిస్తోందని పేర్కొన్నారు.

జూలై నెలలో మామునూర్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశముందని, జూన్లో టెండర్లు పూర్తవుతాయని వెల్లడించారు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు టెండర్లు పిలుస్తామని, స్పోరట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో కొంత వెనుకబడ్డామని అంగీకరించారు.రాబోయే 25 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి తనకు దేవుడు ఇచ్చిన సోదరుడు, ప్రాణ స్నేహితుడని పేర్కొన్న వేం నరేందర్ రెడ్డి, గత ఏడు ఎనిమిదేళ్లలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని దగ్గరగా చూశానన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని నమ్మకంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తాజా మాజీ కార్పొరేటర్లు, ములుగు, జనగాం భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.