కథ మారె.. కల చెదిరె
ఒలింపిక్ ఫైనల్ బౌట్ గెలిచేలా..
భారత పతక కరువు తీర్చేలా..
రెజ్లింగ్ చరిత్రను తిరగరాసేలా..
తన పట్టుతో ప్రత్యర్థి ఉలిక్కిపడేలా..
పసిడితో గర్వంగా తిరిగొస్తుందిలే.. మన వినేశ్ ఫొగాట్‌కథ మారె.. కల చెదిరె
ఒలింపిక్ ఫైనల్ బౌట్ గెలిచేలా..
భారత పతక కరువు తీర్చేలా..
రెజ్లింగ్ చరిత్రను తిరగరాసేలా..
తన పట్టుతో ప్రత్యర్థి ఉలిక్కిపడేలా..
పసిడితో గర్వంగా తిరిగొస్తుందిలే.. మన వినేశ్ ఫొగాట్
- భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు
- 100 గ్రాముల
- అధిక బరువే కారణం
- పసిడి పతక పోరుకు
- దూరమైన స్టార్ రెజ్లర్
- డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరిన వినేశ్
- స్పందించిన ప్రధాని, రాజకీయ, క్రీడా ప్రముఖులు
* జాతీయ జెండా రెపరెపలాడుతుందని అభిమానులు సంబరపడ్డ వేళ.. రెజ్లింగ్‌లో ఈసారి పతకం తీసుకొస్తుందని ఆశించిన వేళ.. ఒక్కరోజు ఆగి ఉంటే ఆమె పేరు దేశం మొత్తం మార్మోగిపోయేది.. కానీ ఒక్కరోజులోనే అంతా తారుమారుయ్యింది. పతకం తీసుకొచ్చి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తుందనుకున్న మల్ల యోధురాలకు అధిక బరువు శాపంగా మారింది.. ఎన్నో అవమానాలు.. చీత్కారాలు తట్టుకొని ఒలింపిక్స్‌లో తన పట్టును చూపిస్తూ ఫైనల్ చేరిన వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుకు బలవ్వడం కోట్లాది అభిమానుల గుండెలు పగిలేలా చేశాయి. అధిక బరువు అన్న మాట.. 140 కోట్ల మంది భారతీయుల కలను అలలా చెరిపేసింది. ‘కల చెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది’ అని పాడుకునేలా చేసింది. ఈ కష్ట సమయంలో ప్రధాని నుంచి సామాన్యుడి దాకా అందరూ వినేశ్‌కు అండగా నిలుస్తూ దేశ స్పూర్తిని చాటుతున్నారు. ఇవాళ నువ్వు ఓడిపోయి ఉండొచ్చు.. కానీ నీ ప్రదర్శనతో మా మనసులు ఎప్పుడో గెలిచావ్.. సలాం
వినేశ్ ఫొగాట్
విజయక్రాంతి, ఖేల్ విభాగం : ఈ ఒలింపిక్స్‌లో దేశానికి ఇంకా 3 పతకాలేనా అనే రందిని తీరుస్తూ.. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే భారత్ ఖాతాలో నాలుగో పతకమే కాకుండా ప్రతిష్ఠాత్మక స్వర్ణం వచ్చి చేరేది. కానీ విధి మాత్రం మనల్ని వెక్కిరించింది. పతక ఆశలను ఆవిరి చేస్తూ వినేశ్ ఫొగాట్‌ను అనర్హురాలిగా ప్రకటించేలా చేసింది. కేవలం 100 గ్రాములు అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఫైనల్‌లో ఓడినా కనీసం రజతమైనా వస్తుందని అనుకున్న కోట్లాది మంది భారతీయులకు నిరాశే ఎదురైంది.
అసలేం జరిగింది?
మంగళవారం పోటీలు ముగిసిన తర్వాత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బుధవారం ఫైనల్ పోరుకు సిద్ధం అయింది. అయితే నిబంధనల ప్రకారం మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ లో పాల్గొనే క్రీడాకారుల బరువు, వారి ఆరోగ్యం, గోళ్లు వంటి వాటిని పరిశీలిస్తారు. ఇలాగే బుధవారం కూడా రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్, అమెరికా రెజ్లర్‌కు కూడా బరువు పరీక్షలు చేశారు. కానీ ఫొగాట్ మాత్రం ఉండాల్సిన (50 కేజీలు) కంటే 100గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
శాపంగా 50 కేజీలు..
వినేశ్ ఫొగాట్‌తో విధి ఆడుకుంది. వినేశ్‌కు 53 కేజీల విభాగం బాగా అచ్చొచ్చింది. ఆ విభాగంలో ఎన్నో పతకాలు సాధించింది. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. రెజ్లింగ్ సమాఖ్యపై పోరాటంతో ఏడాది పాటు వినేశ్ పోటీలకు దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలో వినేశ్ 53 కేజీల విభాగంలో పోటీ పడే సమయానికి మరో రెజ్లర్ అంతిమ్ పంగల్ అదే విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దీంతో వినేశ్‌కు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
ఒకటి ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడం.. లేదంటే బరువు తగ్గి 50 కేజీల విభాగంలో పోటీ పడడం. ఓటమిని ఒప్పుకోని వినేశ్ బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. బరువును నియంత్రిం చుకోవడానికి చాలా కష్టపడింది. కొన్ని రోజుల పాటు కడుపు మాడ్చుకొని నీళ్లు, ఉపద్రవాలే ఆహారంగా తీసు కుంది. ఎంతో ఇష్టమైన పొడవాటి జుట్టును కూడా కత్తిరించుకుంది. ఇలా ఎంతో కష్టపడి 50 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కానీ ఇవాళ ఆ 50 కేజీలే ఆమెకు శాపంగా మారింది. తనకు అచ్చొచ్చిన విభాగాన్ని వదులుకున్న వినేశ్.. ఇవాళ అనర్హత వేటుతో కన్నీళ్లను మిగిల్చింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
వినేశ్‌పై అనర్హత వేటు వేయడంతో అసలు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఇందులో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. పోటీల రోజు తప్పనిసరిగా ఆయా కేటగిరీల్లో పాల్గొనే క్రీడాకారుల బరువును కొలుస్తారు. అలా బుధవారం ఫైనల్ పోరుకు ముందు కొలవగా.. వినేశ్ నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో ఆమె మీద అనర్హత వేటు వేశారు.
కుట్ర కోణం ఏమైనా?
వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వార్త విన్నప్పటి నుంచి అన్నీ అనుమానాలే.. నిజంగా నేశ్ బరువు పెరిగిందా.. కావాలనే ఎవరైనా ఇరికించారా అన్నది ప్రశ్నార్థకమే. రెండేళ్ల కిందట మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై వినేశ్ తన సహచర రెజ్లర్లు భజరంగ్, సాక్షి మాలిక్, ఇతరులతో కలిసి అలుపెరగని పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంది. మహిళా రెజ్లర్లకు న్యాయం చేసేంతవరకు తన పోరాటం ఆగదని వినేశ్ పేర్కొంది. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న పురస్కారంతో పాటు పతకాలను గంగానదిలో కలిపింది.
కానీ ఆ పోరాటమే ఇవాళ వినేశ్ కు శాపంగా మారిందేమోనన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడిపై జరిపిన పోరాటం ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండడం దీనికి కారణం. ఈ నేపథ్యంలో తెలియని దుష్టశక్తులు ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన వినేశ్‌కు పతకం రాకుండా ఇలా కుట్ర పన్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఈ ఆరోపణలను ఖండించింది. ‘ఇందులో కుట్ర ఏమీ లేదు. ఫొగాట్ 53 కేజీలో విభాగంలో పోటీ పడేవారు. 50 కిలోల విభాగంలోకి మారడంతో బరువు తగ్గాల్సి వచ్చింది. అధిక బరువు విషయంలో ఎలాంటి సడలింపు లేదు’ అని పేర్కొంది.
విచారణ చేపడతాం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ‘ఫైనల్‌కు ముందు అధిక బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురవ్వడం బాధాకరం. కేవలం వంద గ్రాముల కారణంగా భారత్ ఒక పతకం కోల్పోయింది. ఈ వ్యవహారంలో వినేశ్ తప్పు లేదు. ఆమె కోచ్, సపోర్ట్ స్టాప్‌పై విచారణ చేయనున్నాం’ అని వెల్లడించారు. భారత బృందం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దీవాలా స్పందిస్తూ.. ‘పోటీలో పాల్గొన్న తర్వాత నిర్దేశిత బరువు కంటే 2.7 కిలోలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. నీరు పరిమిత స్థాయిలో ఇచ్చాం. చెమట కోసం కఠిన వ్యామామాలు చేయించాం. జట్టును కూడా కత్తిరించాం. అయినప్పటికీ వినేశ్ 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. కొంత సమయమున్నా ఆమె బరువు తగ్గించేవాళ్లం’ అని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చేరిన వినేశ్..
అనర్హత వేటు విషయం తెలిసి యావత్ భారతావని దిగ్భ్రాంతికి గురైన వేళ.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం మరింత కలచివేసింది. డీహైడ్రేషన్ కారణంగా స్పృహ కోల్పోవడంతో వినేశ్ బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. మంగళవారం బౌట్ సమయంలో వినేశ్ తన బరువును నియంత్రణలోనే ఉంచుకొంది. ఆటగాళ్లు రెండ్రోజులు బరువును నిర్ణీత కేటగిరి పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మంగళవారం రాత్రికి 2 కిలోలు అదనపు బరువు ఉంది. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. భోజనం కూడా తీసుకోని వినేశ్ బరువు తగ్గడానికి రాత్రంతా మేల్కొని ఉంది. ఇదే ఆమెను డీహైడ్రేషన్ బారిన పడేలా చేసింది. ప్రస్తుతం వినేశ్ ఒలింపిక్ గ్రామంలోని పాలిక్లినిక్‌లో చికిత్స తీసుకుంటుంది. ఈ సందర్భంగా భారత ఒలింపిక్ కమిటీ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష వినేశ్ ఫొగాట్‌ను కలిసి ధైర్యం చెప్పిన ఫోటోలు బయటికి వచ్చాయి.
వినేశ్ నువ్వో చాంపియన్
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘వినేశ్ నువ్వో చాంపియన్‌వి.. నీవు భారత్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శం. గర్వకారణం. నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వర్ణించేందుకు నా దగ్గర మాటల్లేవు. నువ్వు ఈ బాధ నుంచి బయటపడుతావని నమ్ముతున్నా. నీకు మేమంతా అండగా ఉన్నాం’ అని తెలిపారు. పీటీ ఉషతో ప్రధాని మోదీ ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడారు.
దేశం మొత్తం నీవెంటే: పీటీ ఉష
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష విచారం వ్యక్తం చేసింది. డీహైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరిన వినేశ్‌తో ఉష భేటీ అయ్యి ఆమెకు ధైర్యం చెప్పింది. ‘కొద్దిసేపటి క్రితమే ఒలింపిక్ క్రీడాగ్రామంలోని పాలీక్లినిక్‌లో వినేశ్‌ను కలిశా. భారత ఒలింపిక్ సంఘంతో పాటు ప్రభుత్వం, దేశం మొత్తం అండగా ఉందని హామీ ఇచ్చారు’ అని ఉష వెల్లడించింది.
వినేశ్ అధైర్యపడద్దు
వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో ప్రత్యేక ప్రకటన చేశారు. కేవలం 100 గ్రాములు అధిక బరువు కారణంగా వినేశ్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేయడం బాధాకరం. ఈ వ్యవహారంపై ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వినేశ్ విషయంలో భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చర్చించనుంది. ఆమెకు తగిన న్యాయం జరిగేలా చూస్తాం.
* నీ పోరాటం దేశం గర్వపడేలా చేసింది. ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది. నువ్వు పతకానికి
దూరమైనా 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో చాంపియన్‌గా మిగిలిపోతావ్’
ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
* ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను మట్టికరిపించిన వినేశ్ ఫొగాట్ మీద అనర్హత వేటు పడడం విచారకరం. ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం సవాల్ చేసి.. వినేశ్‌కు న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నా..
రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత
* నువ్వు ఈ పుడమి పుత్రికవు. చాలా ధైర్యంగా పోరాడావు. నిన్న గేమ్‌కు ముందు సరిగ్గానే ఉన్న బరువు.. ఒక్క రోజులోనే ఎలా మారిందో నమ్మశక్యం కావడం లేదు. యావత్ దేశం కన్నీటి పర్యంతం అవుతోంది. నీకు అండగా మేమంతా ఉన్నాం..
భజరంగ్ పూనియా,
భారత రెజ్లర్