calender_icon.png 14 October, 2024 | 5:57 AM

కొవిడ్ బాధితులకు గుండెపోట్లు

14-10-2024 03:50:10 AM

ఫస్ట్ వేవ్‌వారికి అధిక ముప్పు 

టీకా తీసుకోనివారికి మరింత ఎక్కువ

ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వ్యక్తులకూ ప్రమాదమే

తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: కొవిడ్ మొదటి వేవ్‌లో ఇన్ఫెక్షన్‌కు గురైనవారిపై జరిగిన పరిశోధనల్లో సంచలన విషయాలు  వెలుగులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ వేసుకోకుండా 2019, 2020లో కొవిడ్ బారిన పడి నవాళ్లలో గుండెపోటు ముప్పు రెండు రెట్లు అధికమని, ఆసుపత్రిలో చికిత్స పొందినవారికైతే ౪ రెట్లు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది.

ఈ ప్రభావం ఇన్ఫెక్షన్ సోకిన నాటి నుంచి మూడేళ్ల వరకు ఉంటుందని తెలిపింది. పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ హూమన్ ప్రకారం.. కొవిడ్ వల్ల వస్తోన్న హృద్రోగాలను టైప్ డయాబెటిస్ రోగులతో పోల్చవచ్చని చెప్పా రు. 2010 మధ్య హృద్రోగాలకు సంబంధించిన మరణాలు తగ్గుతూ వస్తుండగా 2019 తర్వాత హఠాత్తుగా పెరిగాయని చెప్పారు. ఇందుకు కొవిడ్ కారణమని చెప్పారు. 

వారికి ఎక్కువ ముప్పు

ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపులు కలిగిన వ్యక్తులు కొవిడ్ ద్వారా కలిగే హృద్రోగాల బారిన ఎక్కువగా పడుతున్నారని తెలిపింది. అయితే ఓ గ్రూప్ ఉన్నవారికి ముప్పు తక్కువగా ఉన్నట్లు చెప్పింది. ఈ అధ్యయనంలో యూకే బయోబ్యాంక్ డాటాను ఉపయోగించారు. వృద్ధులు, ధనవంతులు, ఎక్కువగా శ్వేతజాతీయుల డాటానే పరిశీలించినట్లు హూమన్ తెలిపారు.

అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో జరిగిన అధ్యయనాలకు దగ్గరగా ఫలితాలు వచ్చాయని చెప్పారు. మీరు ఏ టీకా లేదా బూస్టర్ తీసుకున్నా ఆర్నెల్ల తర్వాత గుండెపోటు, దడ వచ్చే అవకాశం తగ్గింది. కానీ కాలక్రమేణా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. అందుకే బూస్టర్లు తీసుకోవడం అవసరం. కొవిడ్ ద్వారా ఆసుపత్రిలో చేరినవారు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై వైద్యులను సంప్రదించడం ఉత్తమం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి అని వివరించారు.