22-02-2025 12:40:36 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 25న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. పాలకవర్గ పదవీ కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించాలన్న అభ్యర్థనను రాష్ట్ర బార్ కౌన్సిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 24 అసోసియేషన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
వీటిపై శుక్రవారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎ.రవీంద్రరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. బార్ అసోసియేషన్ల ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర బార్ కౌన్సిళ్ల కార్య దర్శులకు 2015లోనే లేఖ రాసినా పట్టించుకోవడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వచ్చే మార్చి 31న ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఎన్నికలపై స్టేటస్ కో కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ ఈనెల 25న మిగతా వాదనలు వింటామని, ఈలోపు బార్ కౌన్సిల్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తన దృష్టికి తీసుకురావొచ్చని సూచించారు.