- వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం
- నేను చేసిన తప్పేంటో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పలేదు
- అంతలోపే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది
- మీడియా సమావేశంలో డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కొన్నిరోజులుగా టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌వర్మపై కేసుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు రాగా.. కోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా ఆయనకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 9 వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.
కాగా ఆ ఆదేశాల అనంతరం రాంగోపాల్ వర్మ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని వాపోయారు. తనపై నమోదైన కేసులు ఉద్ధేశపూర్వకంగా ఉన్నాయనే అనుమానంతోనే ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నానని చెప్పారు. ‘మనది ఫ్రీ వరల్డ్. వ్యంగ్యం అనేది మీడియా సహా ప్రతీ చోటా ఉంటుంది.
ఇప్పుడున్న సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వందలాది మీమ్స్ కనిపిస్తాయి. నేను ఏడాది కింద చేసిన పోస్ట్ కూడా అలాంటిదే. అయితే ఏడాది తర్వాత ఓ వ్యక్తి మేలుకొని నాపై పోలీస్‌స్టేషన్‌లో కంప్లుంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఒక్క పోస్ట్‌ను కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించలేదు. ఇంతలో ఒక సెక్షన్ మీడియా సంస్థలు వర్మను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, భయపడి పారిపోయాడని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాయి.
ఇవే మీడియా సంస్థలు అనేక ప్రోగ్రామ్స్‌లో నాయకుల మీద నెగిటివ్‌గా కథనాలు చేస్తుంటాయి. మొదటిసారి పోలీసులు సంప్రదించినప్పుడు నేను అందుబాటులో లేను. రెండోసారి కూడా ఇంకాస్త సమయం కావాలని అడిగా. కావాలంటే వర్చువల్‌గా వీడియోలో మీతో మాట్లాడుతానని చెప్పా. నేను పొలిటికల్ మూవీస్ మానేస్తానని చెప్పింది అక్కడ జరిగే సెన్సార్ ఇబ్బందులు వల్ల.
ఏడాదిపాటు ఆ సెన్సార్ కోసం వెయిట్ చేయడం చిరాకుగా ఉండి పొలిటికల్ బేస్డ్ మూవీస్ రూపొందించనని చెప్పా. నేన్దునా పోస్ట్ చేస్తే నన్ను, నా ఫ్యామిలీని తిడుతూ వందల కామెంట్స్, మీమ్స్ వస్తాయి. పత్రికల్లో వచ్చే కార్టూన్స్ ఎవరో ఒక నాయకుడి మీద సెటైర్ వేసేవే. నేను చేసిన పోస్ట్‌లో అర్థం మీకొకలా, నాకొకలా కనిపించవచ్చు. అది వ్యక్తిగత దృష్టి కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.