హైదరాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. తనపై విధించిన రిమాండ్ ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వికారాబాద్ కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోపైపు తనకు బెయిల్ కోరుతూ ఆదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ నరేందర్ రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొడంగల్ కోర్టులో విచారణ జరుగనుంది. లగచర్ల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్ లో రిమాండ్ ఖైదిగా ఉన్నారు.