04-04-2025 01:00:10 AM
అప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 3: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలంటూ వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
వాదనలు విన్న ధర్మాసనం.. ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం మరోసారి విచారణ కొనసాగగా.. కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొదని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.