calender_icon.png 24 September, 2024 | 11:48 AM

గ్రూప్ 1పై విచారణ రేపటికి వాయిదా

24-09-2024 12:34:10 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి పలు వ్యాజ్యాలు సింగిల్ జడ్జి విచారణలో ఉండగా అదే అంశంపై పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషర్లను హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీసింది. బుధవారం విచారణలో సింగిల్ జడ్జి విచారణ చేయాలా? లేక తాము విచారణ చేయాలా? అనే అంశాన్ని తేల్చుతామని ప్రకటించింది. 2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్‌సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్..

అన్నింటిలోనూ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా నలుగురు దాఖలు చేసిన వ్యాజ్యాలను జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల క్యాటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వర్టికల్‌గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారని చెప్పారు. మెయిన్స్‌కు 1ః50గా ఎంపిక చేశారని, దీనిలోనూ సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదిస్తూ, పిటిషన్లకు విచారణార్హత లేదని, సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోవాలని చెప్పారు. దీనిపై హైకోర్టు, చట్టబద్ధమైన రూల్స్ లేనప్పుడు సింగిల్ జడ్జి వద్దకు పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పిటిషనర్ న్యాయవాది గడువు కోరడంతో విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.