calender_icon.png 14 March, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణుడి మురళి వింటే గోవుల క్షీరవృష్టి

18-12-2024 12:00:00 AM

ఓంగి=సమున్నతంగా పెరిగి, ఉలగు= మూడు లోకాలను, అళంద= కొలిచిన, ఉత్తమన్= పురుషోత్తముడైన పరంధాముని, పేర్= తిరునామాలను, నాంగళ్= మేము, పాడి= స్తుతిస్తూ, నం పావైక్కు చ్చాత్తి= వ్రతం నెపం మీద, నీర్ ఆడినాల్= స్నానం చేస్తే, తీంగిన్ఱి= ఈతి బాధలేవీ లేకుండా, నాడేల్లాం= దేశమంతటా, తింగళ్= నెలకు, ముమ్మారి పెయ్దు= మూడు వానలు కురుస్తాయి, ఓంగు పెఱుం జెన్నెలూడు= బాగా పెరిగి ఎరుపు రంగులో ఉన్న ధాన్యపు గింజలు వేలాడే వరిపొలాల మధ్యలో, కయల్ ఉగళ= చేపలు తుళ్లి పడుతూ ఉంటే, పూంగువళై ప్పోదిల్= సుందరమైన కలువ పూవులలో, పోఱివండు= అందమైన తుమ్మెదలు, కణ్- నిద్రిస్తూ ఉంటే, తేంగాదే= సంకోచం లేకుండా, పుక్కు= పాలు పిండడానికి ప్రవేశించి, ఇరుందు= స్థిరంగా ఉండి, శీర్ త్త ములై= నిండిన పొదుగులను, పత్తి(ట్రి)= పట్టుకుని, వాంగ= పిండగా, క్కుడం నిఱైక్కుం= కుండలు నిండిపోతున్నాయి, వళ్ళల్ = ఉదారంగా, పెరుం పశుక్కళ్= పెద్దగా పెరిగిన పశువులను, నీంగాద శెల్వం= ఈ విధమైన అక్షయమైన సంపద, నిఱైందు= నిండి ఉంటుంది.

ఆయన త్రివిక్రముడు. మూడు లోకాలను రెండడుగుల్లో కొలిచిన వాడు. స్నానం చేసి వ్రతం పేరుతో ఆ వామనుడిని స్తుతిస్తే ఈతిబాధలు ఉండవు. నెలకు మూడు వానలు కురుస్తా యి. వరిపంటలు బాగా పెరిగి ఎర్రని గింజలు చూడవచ్చు. ఆ వరిచేలల్లో నిండిన జలాల్లో చేపలు తుళ్లి పడుతాయి.

కలువ పూల మకరందాలను గ్రోలుతూ అందమైన తుమ్మెదలు మై మరచి నిద్రిస్తాయి. పశుసంపద కూడా తక్కువేమీ కాదు. బాగా బలిసిన పశువులు గోపా లకులు పాలు పితకడానికి సంశయించకుండా దగ్గరికి వచ్చి పొదుగులు పట్టుకోగానే పాలు కురిసి కుండలు నిండిపోతున్నాయి. అక్షయమైన సంపద వెల్లివిరుస్తున్నది.

పొట్టివాని రూపం ఎవరైనా ధరించడానికి ఇష్ట పడతారా? యాచకుడిగా జన్మిస్తాడా? ఏ వికారాలు లేనివాడు, అప్రాకృత శరీరి అయిన స్వామి భక్తులను ఆదుకోవడానికి, బలి అన్యాయంగా ఆక్రమించిన దేవతల రాజ్యాన్ని ఇప్పించడానికి వామనుడై వచ్చాడు. మూడడుగుల నేల ఇస్తానంటే పొంగిపోయి పెరిగిపో యినాడు. రెండుడుగులతోనే లోకాలు కొలిచినాడు. పురుషోత్తముడు. భక్తులకోసం వామను డైన పరంధాముడెంత ఉత్తముడని గోపికలు పరవశిస్తున్నారు. 

అన్నమయ్య ఈ సంకీర్తనలో విష్ణువు పాదా ల గొప్పతనాన్ని వర్ణించాడు. బ్రహ్మ కడిగిన పాదము; బ్రహ్మముతానెని పాదము. ఈ పాదాలు బ్రహ్మచే కడిగినవి; ఈ పాదాలు పరమాత్ముని నివాసం. జ్ఞానం కూడా. త్రేతాయు గంలో, విష్ణువు వామనుడు, మరుగుజ్జు, మొదటి మానవరూపంగా వస్తున్నాడు నారాయణుడు. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉన్నారు. ఇతరులను సొంత లాభం కోసం హింసించే వారు అధములు, ఇతరులతోపాటు మనమూ బాగుండాలనుకునే వాడు మధ్యముడు.

తన ప్రాణాలను లెక్కించక పరోపకారం చేసేవాడు ఉత్తముడు. దీనమైన, హీనమైన రూపునైనా సరే ధరించి భక్తులను కాపాడే హరి ఉత్తముడు, పురుషోత్తముడు. “ప్రాణాలనూ, నిన్నూ, లక్ష్మణుడినైనా వదులుకుంటాను గాని, (మునులను రాక్షస పీడనుంచి విముక్తం చేస్తానని) చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకుండా వదలను” అని శ్రీ రాముడు సీతతో అంటాడు.

ఉత్తమ లక్షణం అది. క్షత్రియ వంశంలో జన్మించినా గొల్లవాడిగా పెరగడానికి జంకని వాడు శ్రీకృష్ణుడు. జాతిని వదులుకున్నాడు. శ్రీ కృష్ణుడెంత ఉత్తముడు. ఆ పురుషోత్తముని నామాలను కీర్తిస్తూ వ్రతం మొదలు పెట్టారు. గోవింద నామం జపిస్తే ద్రౌపదికి వస్త్రధార లభించింది. రామనామంతో హనుమ సులభంగా సముద్రాన్ని దాటా డు. అదే రాముడు వంతెన నిర్మిస్తే తప్ప దాటలేక పోయాడు.