17-04-2025 04:27:45 PM
మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ..
కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును వాదిస్తున్న సల్మాన్ ఖుర్షీద్ బృందంతో కలిసిన అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ... వక్ఫ్ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Justice Sanjiv Khanna), జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టిందని అన్నారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కేవియెట్ దాఖలు చేసిందన్నారు. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? రెండోది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై విచారణ స్వీకరించాల లేదా అనే విషయం తెలిపిందన్నారు. ఓ పిటిషనర్ తరఫున తమ సీనియర్ న్యాయవాదుల బృందం వాదనలు వినిపించారు. పార్లమెంట్ చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తలదూర్చడమే అన్నారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Act) ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామన్నారు. చట్టం ప్రకారం ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని, ఈ పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు.
వక్ఫ్-అలల్-ఔలాద్‌ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదని.. దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదన్నారు. ఎవరైనా వక్ఫ్‌ను స్థాపించాలనుకుంటే.. అతను ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తున్నాడని నిరూపించుకోవాల్సి ఉందని అన్నారు. ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని.. సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని.. ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందన్నారు.