calender_icon.png 24 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పుల కుప్పలే.. సొంతింట తిప్పలే!

24-11-2024 03:35:35 AM

నాటి నుంచి నేటిదాకా వెండితెరపై మెరిసిన తెలుగు నటీమణులంతా ఒప్పుల కుప్పలుగా ప్రేక్షకుల మెప్పు పొందినవారే! అందం, అభినయం, ఆంగికంతో అలనాటి నటీమణులు ఎక్కువ కాలం తెరపై కనిపిస్తే, నేటితరం కొత్తందాలు మాత్రం అతితక్కువ సమయంలోనే ‘తెర’మరుగవుతున్నారు. మారిన కమర్షియల్ జమానాలో కళకు విలువ లేనట్టేనా? ఈతరం హీరోయిన్లు ఎక్కడ వెనుకబడిపోతున్నారు? ప్రేక్షక దేవుళ్ల ఆదరణ లేకనా..? మూవీ మేకర్స్‌ను మెప్పించలేకనా? 

తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టపడని నటీనటులుండరు. ఒకప్పుడైతే టాలీవుడ్‌ను తక్కువగా చూసేవారేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టాలీవుడ్ కూడా నాటి నుంచి నేటి వరకు హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు.. ఇలా 24 క్రాఫ్ట్‌ల వారినీ అక్కున చేర్చుకుంటోంది. ప్రతి ఒక్కరికీ ఇదొక అద్భుతమైన ప్లాట్‌ఫాం. ఇక్కడ ఒకట్రెండు సినిమాలు హిట్ అయితే చాలు.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ఇలా ఇక్కడ స్టార్‌డమ్ సంపాదించుకుని బాలీవుడ్‌ను ఏలుతున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే అమ్మలాంటి ఇండస్ట్రీ.. కన్నపిల్లలను వదిలి సవతి పిల్లలపై ప్రేమ చూపడమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

తెలుగు నేలపై పుట్టి హీరోయిన్‌గా అవకాశం వచ్చినా కూడా ఎందుకు ఒకట్రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు? కనీసం ఆ సినిమాలు వారికి పెద్దగా గుర్తింపును కూడా ఎందుకు తీసుకు రావడంలేదు? ఇండస్ట్రీకి చెందిన బడా దర్శకనిర్మాతలు తెలుగు హీరోయిన్లపై ఎందుకు దృష్టి సారించడం లేదు.

కొందరు దర్శకులు తెలుగు హీరోయిన్లను ఎంచుకున్నా వారెందుకు రాణించడం లేదు? ప్రేక్షకులు సైతం తెలుగు హీరోయిన్ల చిత్రాలను ఎందుకు ఆదరించడం లేదు? తప్పు ఎక్కడ జరుగుతోంది? దర్శక నిర్మాతల్లోనా? హీరోయిన్లలోనా? ప్రేక్షకుల్లోనా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవే అన్నీనూ. 

టాలెంట్ ఒక్కటే సరిపోదు..

ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు. అందచందాలు, వాటిని ఆరబోసే తెగువ ముఖ్యం. ఇది గ్లామర్ ప్రపంచం. వారికేనా ఆదరణ?! అంటే.. అందాలు ఆరబోయకున్నా శిఖరంలా నిలబడగలిగే సాయిపల్లవి లాంటి హీరోయిన్లు ఒకరిద్దరే కనిపిస్తారు. మిగతావారంతా అవసరం మేరకు తెగువ చూపాల్సిందే. తెలుగు నేల సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ అమ్మాయిని పెంచే విధానం వేరు. పద్ధతికి పట్టుచీర కడతారు.

ఇండస్ట్రీలో ఇలాంటివి వర్కవుట్ కావు. అందాలను ఆరబోయాల్సిందే.. కొందరిని మెప్పించాలి. మరి ఆ మెప్పించే తెగువ తెలుగు నేలపై పుట్టిన వారికి ఉంటుందా? అంటే చాలా కష్టం. అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే తల్లిదండ్రులు అదొక మురికి కూపంలా చూస్తుంటారు. అలాంటప్పుడు తమ కూతురిని దానిలోకి ఎలా పంపిస్తారు? బాలీవుడ్‌లో అలా ఉండదు. వారి మైండ్ సెట్, కల్చర్ అన్నీ మనకు డిఫరెంట్. వారు తొందరగా ఎవరితో అయినా మింగిల్ అవుతారు. మనం కాలేము. అది కూడా మనకు దెబ్బే.

ఇప్పుడంతా కమర్షియల్..

ఒకప్పుడు అంతమంది హీరోయిన్స్ ఎలా వచ్చారు.. అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి కదా అనే సందేహం రావొచ్చు. అప్పట్లో సంస్కృతీ సంప్రదాయాలకు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదు. మరి అంతలా మడి కట్టుకునే రోజుల్లోనే తెలుగు నేలకు చెందిన హీరోయిన్లు చాలా మంది వచ్చారు కదా అంటే అప్పట్లో కళలకు, కళాకారులకు చాలా విలువ ఉండేది. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడంతా కమర్షియల్.

అప్పట్లో నటనకు పెద్ద పీట వేసేవారు. అందుకే సావిత్రి, జమున, కృష్ణవేణి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద వంటివారు రాణించగలిగారు. ఇప్పుడు హీరోయిన్‌కు అందచందాలు, నటతో పాటు కొందరిని మెప్పించగల నైపుణ్యం ఉండాలి. అలా మెప్పించలేక తెలుగు నేలపై పుట్టిన ముద్దుగుమ్మలు ఒకట్రెండు సినిమాలకే అవుట్ అవుతున్నారు. బయటి నుంచి పెద్ద ఎత్తున హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తున్నారు. రెండు మూడు సినిమాలు మంచి హిట్ కొట్టాయంటే బాలీవుడ్‌కు జంప్ అవుతున్నారు.

కొందరేమో బాలీవుడ్‌కి వెళ్లి ఆదరించిన తెలుగు నేలపై రాళ్లేస్తున్నారు. మరికొందరు మాత్రం గుర్తు పెట్టుకుంటున్నారు. తెలుగమ్మాయి అంజలి ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమవుతోంది. గుర్తింపునిచ్చే సినిమాలు కూడా చేశారు. అయినా నో స్టార్‌డమ్. అనన్య నాగళ్ల ఏవో చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు. శ్రీలీల మాత్రం బాగానే గెటన్ అవుతున్నారు కానీ ఎంతకాలమో చెప్పలేం. ఇంకా తెలుగమ్మాయిలు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.