calender_icon.png 12 October, 2024 | 5:50 PM

సఫాయి కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి

10-10-2024 12:00:00 AM

సఫాయి కర్మచారి కమిషన్ జాతీయ సభ్యుడు పీపీ వావా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సఫాయి కార్మికుల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సఫాయి కర్మచారి కమిషన్ జాతీయ సభ్యుడు డాక్టర్ పీపీ వావా సూచించారు. నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన ఆయా విభాగాల అధికారులతోపాటు వాల్మీకీ అసోసియేషన్ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.

పారిశుద్ధ్య కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ పీపీ వావా మాట్లాడుతూ.. మాన్యువల్ స్కావెంజర్ నిషేధ చట్టంపై  ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు.

వారికి బీమా సౌకర్యంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపా యాలు వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి పునరావాసం కల్పించాలన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలన్నారు. వారి సమస్యలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ విభాగానికి నివేదించామన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో మాన్యువల్ స్కావెంజర్స్ విధానం లేదని స్పష్టం చేశారు. నగరంలో ఆ చట్టం పకడ్బందీగా అమలవుతున్నదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో సాంకేతిక పరికరాలు, వాహనాలను వినియోగిస్తున్నార న్నారు. వారి ఆరోగ్య సంరక్షణ కోసం మూడు నెలలకోసారి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.

కార్మికుల హాజరును పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతినెలా 1వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూస్తున్నామన్నారు. సమావేశంలో కమిషన్ సలహా దారుడు వీరేంద్రనాథ్, అడిషనల్ కమిషనర్లు రఘుప్రసాద్, పంకజ, నళినీ పద్మావతి పాల్గొన్నారు. 

టెండర్లు నిర్వహించాలి..

సఫాయి కర్మచారి కమిషన్ జాతీయ స భ్యుడు డాక్టర్ పీపీ వావా నిర్వహించిన స మావేశంలో అఖిల భారతీయ వాల్మీకీ మహాసభ అధ్యక్షుడు కిషన్‌లాల్ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో బీవోటీ టాయిలెట్లకు 30 ఏళ్లుగా టెండర్లు లేకుండానే నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ టాయిలెట్ల నిర్వహణకు టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.