calender_icon.png 31 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుమూల ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఎంతో దోహదపడతాయి

31-01-2025 07:19:19 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రాణాంతకమైన వ్యాధులకు వైద్య పరీక్షలు చేయించుకోలేని గిరిజనుల సౌలభ్యం కొరకు ఈ మెగా హెల్త్ క్యాంపులు ఎంతో దోహదం చేస్తాయని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు దుమ్ముగూడెం మండలం గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి శిబిరానికి వచ్చిన గిరిజన మహిళలతో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ... కొండ కోనల్లో నివసించే ఆదివాసి గిరిజనులకు కార్పొరేట్ స్థాయిలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన మందులు అందజేసి ప్రమాదకరమైన జబ్బులను నయం చేయడానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ వైద్య శిబిరంలో వివిధ భయంకరమైన జబ్బులకు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులచే వివిధ రకాల స్కానింగ్లు చేయించి రోగ నిర్ధారణ అయితే వాటికి సంబంధించిన మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో గర్భిణీ స్త్రీల ప్రత్యేక స్కానింగ్, సాత్విక కంటి పరీక్ష, చిన్నపిల్లల, చర్మవ్యాధి, చెవి, గొంతు వైద్య నిపుణులచే ఉదయం 10.00 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యేక వైద్య నిపుణులచే నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ (52), అవసరమైన ల్యాబ్ టెస్ట్ చేయడం జరిగిందని, 570 మంది పేషెంట్లకు వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి సరిపడా మందులు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ భాస్కర్, ప్రోగ్రాం అధికారి బాలాజీ, డాక్టర్లు చైతన్య, పుల్లారెడ్డి, రేణుక రెడ్డి, నాగరాజు, సచిన్, మౌనిక, వెంకన్న, వాణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.