calender_icon.png 21 September, 2024 | 7:41 PM

సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

21-09-2024 02:23:44 AM

రూ. 19,500కు పెరిగిన వేతనం

మంత్రి రాజనర్సింహతో సమావేశం

 హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి సమ్మె చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు శుక్రవారం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఆరోగ్యమిత్రల స్టేట్ కమిటీ నాయకులతో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. 

క్యాడర్ మార్పు..

10 ఏళ్లుగా పెండింగులో ఉన్న క్యాడర్ మార్పు, వేతనం పెంపుదలపై మంత్రి రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఆరోగ్యమిత్రలను డేటా ఎంట్రీ ఆపరేటర్ క్యాడర్‌గా గుర్తిస్తూ వేతనాన్ని రూ.15,600 నుంచి రూ. 19,500కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏరియర్స్ చెల్లించటానికి, సమ్మె కాలం లో ఓడీ క్రింద వేతనాలు చెల్లించాలని ట్రస్ట్ సీఈవోకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోగ్యమిత్రల సమ్మె విరమిస్తున్నట్లుగా మంత్రికి తెలియజేశారు.

ఈ మేరకు సమ్మె విరమణ లేఖను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అందిస్తున్న ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ఆరోగ్యమిత్రలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించినందుకు మంత్రి రాజనర్సింహకు వారు కృతజ్ఞతలు తెలిపారు.  చర్చలలో ఆరోగ్యమిత్రల రాష్ర్ట అధ్యక్షుడు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి కుమార్, ఉపాధ్యక్షులు విష్ణు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు రాజు,  గిరి,  సమీర్, తదితరులు పాల్గొన్నారు.