calender_icon.png 16 January, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌కు ఎదురుగాలి!

20-12-2024 12:00:00 AM

ఢిల్లీ శాసనసభకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 1993లో ఢిల్లీకి రాష్ట్ర హోదా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగితే బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడు పర్యాయాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందాయి. ఢిల్లీ రాజకీయాలలో ఆప్ అరంగేట్రం తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌లకు శాసనసభ ఎన్నికలలో విజయం దక్కటం లేదు.

గత రెండు ఎన్నికలలో కాంగ్రెస్ 70  స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో తన ఖాతానే తెరవలేదు. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు జాతీయ పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డబోతున్న నేపథ్యంలో ఢిల్లీ ఓటరు కరుణ ఎవరిపైన ఉంటుందనే.. అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే, అధికార ఆప్ మాత్రం శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి మిగతా పార్టీల కంటే ప్రచారంలో ముందు ఉందనే చెప్పాలి.

పట్టు కోల్పోయిన జాతీయ పార్టీలు

2015, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజ యాన్ని సాధించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలబడితే గత రెండు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఒక్క శాసనసభ స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఇక బీజేపీ కూడా పట్టుమని 10 శాసనసభ స్థానాలలో కూడా విజయం సాధించలేకపోయింది. కాబట్టి రాబోయే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా ఆప్‌ను ఓడించి కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలైనప్పటికీ, 2024 లోక్ సభ ఎన్నికల లో కలిసి పోటీ చేసినా రాబోయే శాసనసభ ఎన్నికలలో  ఒంటరిగానే పోటీ చేయా లని ఆప్ భావించటంతో కాంగ్రెస్‌కూ ఒంటరిగా బరిలోకి దిగక తప్పని పరిస్థితి. గత మూడు లోక్‌సభ ఎన్నికలలో 100 శాతం స్ట్రైక్ రేటుతో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలలో జయకేతనం ఎగరవేసిన బీజే పీ శాసనసభ ఎన్నికలలో మాత్రం గెలుపు ముందు చతికిల పడుతోంది.

2024 లోక్ సభ ఎన్నికలలో 52 శాసనసభ స్థానాల పరిధిలో ఆధిక్యత సాధించిన బీజేపీ ఎలాగైనా శాసనసభలో పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉంది. హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెరవెనక ఉండి మంత్రాంగం నడిపిన ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఢిల్లీలో బీజేపీగెలుపు కోసం రంగంలోకి దిగింది. మారిన రాజకీయ పరిస్థితు లలో రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తు న్నారు.

2012లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో 28 శాసనసభ స్థానాలలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఒక దశాబ్ద కాలంలోనే ఆప్ జాతీయ పార్టీగా ఎదగటానికి ఢిల్లీలోనే పునాదులుపడ్డాయి కాబట్టి నాలుగోసారి కూడా విజయం సాధించి తన పట్టు నిరూపించుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ సర్వశక్తు లు ఒడ్డబోతుంది. అయితే ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుగాలి తప్పదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడి పార్టీగా రాజకీయాలలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పారీ,్ట దాని అధినేత కేజ్రీవాల్ అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుని కొన్ని రోజులు జైలు పాలయ్యా రు.  కేజ్రీవాల్‌తో పాటు పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకూడా ఇదే  కుంభకోణంలో అరెస్ట్ అయి నెలల తరబడి తీహార్ జైల్లో ఉండటం, అనేకమంది ఆప్ నేతలపై కూడా అవినీతి ఆరోపణలు, అరెస్టులతో ఆప్‌కు రాజకీయంగా ఎదురుగాలి వీచట మే కాదు కేజ్రీవాల్ ప్రభ కూడా మసకబారిన నేపథ్యంలో జరగబోతున్న ఢిల్లీ శాసన సభ ఎన్నికలలో మునపటి విజయాల ను అప్ సాధించగలుగుతుందా అనే సందేహా లు వ్యక్తం అవుతున్నాయి.

కేజ్రీవాల్ కార్యాలయంలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై దాడి, ఆమ్ ఆద్మీ పార్టీ లో సీనియర్ నాయకుడైన కైలాస్ గెహ్లాట్ లాంటి వారు పార్టీ నుండి నిష్క్రమించటం ఆ పార్టీకి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు.

ఇద్దరికీ గెలుపుపై ధీమా! 

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానమైన పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్యనే ఉండే అవకా శం కనిపిస్తుంది. గత మూడు శాసనసభ ఎన్నికలలో గెలుపును పునరావృతం చేసి నాలుగోసారి విజయం సాధించాలని ఆప్ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో గెలుపు సాధిస్తున్నా శాసనసభ ఎన్నికలలో ఎదురవుతున్న ఓటమిని అధిగమించి చరిత్రను పునరావృతం చేసి మరొకసారి గెలుపు సాధించాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

దశాబ్ద కాలంగా ఢిల్లీలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరొకసారి విజయం సాధించి పెడతాయని ఆప్ బలంగా విశ్వసిస్తుంది. సర్వోదయ పాఠశాలలతో ప్రభుత్వ స్కూళ్ల లో తీసుకువచ్చిన మార్పులు, మొహల్లా క్లినిక్‌లతో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పేదలకు మెరుగైన వైద్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సురక్షితమైన తాగునీరు, ఉచిత విద్యుత్, సీఎం సమ్మాన్ యోజనకింద మహిళలకు ఇచ్చే వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని 2100 రూపాయలకు పెంచుతామనే హామీ తమ ను  విజయతీరాలకు చేర్చుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్త్తోంది.

బలమైన ఆర్‌ఎస్‌ఎస్ కేడర్ మద్ద తు, మోడీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేజ్రీవాల్  ఉన్న అవినీతి ఆరోపణలు, ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకుపోవటం ద్వారా ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. సామాన్యుడి పార్టీగా చెప్పుకునే ఆప్ నేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తన నివాసం కోసం ఎంతటి విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారో చూడండంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికిఆ పార్టీ సిద్ధపడటం లేదనే విష యం స్పష్టం అవుతుంది. 

ఓటర్ల విజ్ఞత

ఎన్నికలలో ఢిల్లీ ప్రజలు విజ్ఞతను ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. శాసనసభ ఎన్నికల లో ఆప్‌కు, లోక్ సభ ఎన్నికలలో బీజేపీపికి ఓటు వేసి గెలిపిస్తున్న ఢిల్లీ ప్రజలు రాబోయే శాసనసభ ఎన్నికలలో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే ఆప్ గెలుస్తుంది. సర్కారును మార్చాలని భావిస్త్తే బీజేపీ గెలుస్తుంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో గెలుపుతో బీజేపీ దూకుడు మీద ఉంటే ఢిల్లీ ఎన్నికలలో గెలుపు ఆప్ కు జీవన్మరణ సమస్యగా మారింది.

ఆప్ ఓటమి ఇండియా కూటమిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేక పోలేదు. ప్రతికూల పరిస్థితులు నడుమ ఆప్ మరొకసారి విజయం సాధిస్తే అది సామాన్యుడు ఆప్‌కు కట్టబెట్టిన విజయం గానే భావించాలి. అయితే ఆమ్‌ఆద్మీ పార్టీ కి రాబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలుపు నల్లేరుపై నడక మాత్రం కాదనేది రాజకీయ పరిశీలకుల అంచనా.

-డా.తిరుణహరి శేషు
వ్యాసకర్త సెల్: 9885465877