కన్నతండ్రే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు చాలానే విన్నాం. దానికి తానేమీ మినహాయింపు కాదని.. చిన్నతనంలో తాను కూడా తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినీనటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించిన ఖుష్బూ తాజాగా మరోసారి తెలిపారు.
ఆయన వల్ల తన కుటుంబమంతా నరకం చూసిందని ఆమె వెల్లడించారు. తనపై ఆయన చేస్తున్న లైంగిక దాడి విషయాన్ని బయటకు చెబితే తన వాళ్లను ఇంకెంత హింసిస్తాడోనని చెప్పలేదని ఖుష్బూ పేర్కొన్నారు. “చిన్నతనంలోనే నా తండ్రి నుంచి లైంగిక దాడికి ఎదుర్కొన్నా. నా తల్లి, సోదరులను బెల్టు, చెప్పులు, కర్ర.. చేతికి ఏది దొరికితే దానితో కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు.
అమ్మనైతే తలను గోడకు కొట్టి దారుణంగా హింసించేవాడు. చిన్నతనంలోనే దారుణమైన వేధింపులు చూశా. బయటకు చెబితే నా తల్లి, సోదరులను ఇంకెంత హింసకు గురి చేస్తాడోనన్న భయంతో మౌనంగా ఆయన హింసను భరించా. చెన్నైకు వచ్చి నా కాళ్లపై నేను నిలబడిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎదురుతిరిగా.. కానీ దానిని ఆయన భరించలేకపోయాడు.
షూటింగ్ ప్రదేశానికి వచ్చి నన్ను బాగా కొట్టేవాడు. ఉబిన్ అనే హెయిర్‌డ్రెస్సర్ నాకెంతో సాయం చేసింది. నాతో ఆయన ప్రవర్తన సరిగా లేదని గుర్తించి ధైర్యం చెప్పింది. అలా మొదటిసారి 14 ఏళ్ల వయసులో నా త్ండరి లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చి మాట్లాడటంతో ఆయన మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
నేను వెదకాలని కానీ.. కలవాలని కూడా చూడలేదు. గతేడాది ఆయన మరణించాడని తెలిసిన వాళ్లు చెప్పారు” అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.