calender_icon.png 27 April, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకీ పట్టినోడు.. తుపాకీకే బలవుతాడు

27-04-2025 12:15:46 AM

  1. పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు 
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తుపాకీ పట్టినోడు.. చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని తెలిపారు.. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడిఉందని.. అందులో భాగంగా పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు ఉండబోతున్నాయని హెచ్చరించారు.

ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్‌దేశం అండగా నిలవాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగించారు. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. 2022, అక్టోబర్ 22న ప్రారంభమైన రోజ్‌గార్ మేళా నేటికీ కొనసాగుతోందన్నారు.

ఇప్పటివరకు 14 రోజ్‌గార్ మేళాలను నిర్వహించి 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో సుమారు 700 మంది అభ్యర్థులు నియామకపత్రాలు అందుకోబోతున్నట్టు తెలిపారు. రాష్ర్టంలో గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందని.. పేపర్ లీకేజీలు, కాలయాపనతో నిరుద్యోగులకు అన్యాయం చేసిందన్నారు.

ఈ ప్రభుత్వంలోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటికి తావులేకుండా క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వీ సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.