30-01-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జనవరి 29: జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్త కసాయగా మారాడు. మూడోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనని అనుమానించి భార్యను పుట్టింటికి పంపాడు. తనకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళ అని సైతం విస్మరించాడు.
ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హసన్ నగర్ ప్రాంతానికి చెందిన హుమేరా బేగంను ఐదేళ్ల క్రితం యాకుత్పురా ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరు చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్నారు. మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పుడే భర్త తనపై దాడి చేశాడని హుమేరా బేగం కన్నీటి పర్యంత మైంది.
ఈ నేపథ్యంలో గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అయిన హుమేరాబేగం మూడో సారి ఆడపిల్లకు జన్మనిస్తుందే మోనని అనుమానించిన అక్బర్ ఖాన్ ఆమెను వేధించసాగాడు. బుధవారం భార్యాపిల్లల్ని ఇంట్లోంచి గెంటేయడంతో హసన్ నగర్ లోని పుట్టింటికి వచ్చింది. వివాహ సమ యంలో అత్తింటి వారు ఇచ్చిన సామాగ్రిని కూడా అక్బర్ ఖాన్ తిరిగి ఆటోలో పంపించేశాడు.
బాధితురాలు లబోదిబో మంటూ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకట్ రామిరెడ్డి తెలియజేశారు. వివాహం అయినప్పటి నుంచి భర్త అత్తమామలు తను వేధిస్తున్నట్లు హుమేరా బేగం తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.