‘రతన్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళతా. శతాబ్దం క్రితం నెలకొన్న టాటా ట్రస్టులు సమాజ శేయస్సుకు పనిచేసే వినూత్న సాధనాలు. అభివృద్ధి, దాతృత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి, జాతి నిర్మాణంలో మా భాగాన్ని పోషించడానికి మేము పునరంకితం అవుతున్నాం’
నోయల్ టాటా
టాటా ట్రస్టుల కొత్త చైర్మన్
- నోయల్ టాటా చేతికి టాటా గ్రూప్ పగ్గాలు
- టాటా ట్రస్టులకు చైర్మన్‌గా ఎంపిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్‌కు దివంగత రతన్ టాటా స్థానాన్ని భర్తీచేసే వారసుడి ఎంపిక జరిగిపోయింది. రతన్ సోదరుడు, సవతి తల్లి కుమారుడు నోయల్ టాటాను టాటా ట్రస్టులకు కొత్త చైర్మన్‌గా నియమించారు.
టాటా ట్రస్టులకు చైర్మన్‌గా ఉండేవారే టాటా గ్రూప్‌ను నడిపిస్తారు. టాటా గ్రూప్ కంపెనీల వాటాలన్నీ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ వద్ద ఉంటాయి. ఆ టాటా సన్స్ వాటాలు టాటా ట్రస్టుల చేతిలో ఉంటాయి. నోయల్ టాటాను అన్ని టాటా ట్రస్టులకు చైర్మన్‌గా నియమించినట్లు శుక్రవారం టాటా ట్రస్టులు ప్రకటించాయి.
రతన్ టాటా బుధవారం కన్నుమూయడంతో వారసుడ్ని ఎంపిక చేయడానికి వివిధ ట్రస్టులకు చెం దిన ట్రస్టీలు ముంబైలో సమావేశమయ్యా రు. ట్రస్టీలు ముందుగా చైర్మన్ రతన్ టాటా కు నివాళి అర్పించారని, టాటా గ్రూప్‌కే కాకుండా, దేశానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నట్లు టాటా ట్రస్టుల ప్రకటన పేర్కొంది.
తదుపరి వివిధ టాటా ట్రస్టులకు చైర్మన్‌గా నోయల్ టాటాను నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని ప్రకటన వివరించింది. నోయల్ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది.
ఒక తండ్రి బిడ్డలే
రతన్ టాటా, నోయల్ టాటాలు ఒక తండ్రి (నావెల్ టాటా) బిడ్డలే కానీ తల్లులు వేరు. టాటా సన్స్‌లో వ్యక్తిగతంలో అత్యధిక వాటా (18.4 శాతం) కలిగిన షాపూర్జీ పల్లోంజి మిస్త్రీకి నోయల్ టాటా అల్లుడు కూడా. పల్లోంజి మిస్త్రీ కుమార్తె, దివంగత సైరస్ మిస్త్రీ సోదరి అలూ మిస్త్రీనే నోయల్ వివాహం చేసుకున్నారు.
సైరస్ మిస్త్రీ రతన్ టాటా వారసుడిగా 2011లో ఎంపికైనప్పటికీ, తదుపరి తలెత్తిన వివాదంలో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి 2016లో టాటా ట్రస్టులు సైరస్‌ను తొలగించాయి. రెండేండ్ల క్రితం సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు.
యూకేలోని సస్సెక్స్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన నోయల్ టాటా ముగ్గురు సంతానం. కుమార్తెలు లెహ్ టాటా, మాయా టాటా, కుమారుడు నెవిల్లే టాటాలు ముగ్గురూ టాటా గ్రూప్‌లోనే వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
టాటా గ్రూప్‌లో నోయల్ ప్రస్థానం
నోయల్ టాటా 1999 నుంచి టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. టాటాల విజయవంతమైన రిటైల్ కంపెనీ ట్రెంట్‌కు చైర్మన్‌గా కొనసాగుతూ వెస్ట్‌సైడ్, జుడియో తదితర రిటైల్ చైన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీ వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్‌కు నోయల్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
67 ఏండ్ల నోయల్ టాటా ఇప్పటికే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దోరాబ్జి టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. ఇప్పటివరకూ తన సోదరుడు రతన్ టాటా నీడలో పనిచేసుకుంటూపోయిన నోయల్ టాటా ఇక నుంచి టాటా ట్రస్టులను నడిపే బాధ్యతను తీసుకుంటారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు 66 శాతం వాటా ఉన్నది. టాటా సన్స్‌కు ప్రస్తుతం చంద్రశేఖరన్ చైర్మన్‌గా ఉన్నారు.