calender_icon.png 15 November, 2024 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేబుల్‌పై పిస్తోల్ పెట్టి బెదిరించాడు

15-11-2024 01:54:42 AM

  1. ఫోన్ ట్యాపింగ్ చేసింది..చేయించింది కేటీఆరే
  2. పదేళ్లు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని బీఆర్‌ఎస్ అమలు చేసింది
  3. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): గతంలో అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తన టేబుల్‌పై పిస్తోల్ పెట్టి పార్టీ మారొద్దని తనను బెదిరించాడని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది.. చేయించింది కేటీఆరేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల దాడిలో కేటీఆర్ పాత్రపై పూర్తి విచారణ జరపాలని...

ఆయన పాత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తో కలిసి వేముల వీరేశం సీఎల్పీలో మాట్లాడారు. గతంలో కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేశారని, ఆయన పాపాలు బయటకు వస్తే తెలంగాణలో ఐదు నిమిషాలు కూడా ఆయన ఉండలేడని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాలో డీటీసీలో 1,300 మందిని కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆదేశాలతో చింత్రహింసలకు గురిచేశారని తెలిపారు. చిరుమర్తి లింగయ్య కాదు.. కేటీఆరే దొంగచాటున ఫోన్ సంభాషణలు విన్నారని పేర్కొన్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నాడన్నారు. నరేందర్ రెడ్డి ద్వారా కేటీఆర్‌నే కుట్ర చేశారని ఆరోపించారు.

కొడంగల్‌లో పరిశ్రమలు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కేటీఆర్ ఇలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మల్లన్న సాగర్ కోసం గత ప్రభుత్వం 12 గ్రామాల ప్రజలను బెదిరించి, దౌర్జన్యం చేసి భూసేకరణ చేసిందన్నారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు గా కేటీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

పదేండ్లు రాష్ర్టంలో అప్రకటిత ఎమర్జెన్సీని బీఆర్‌ఎస్ అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీని క్షమించదన్నారు. పాపాలు, దుర్మార్గాలు చేసి కేటీఆర్ ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ కారణంగా బీఆర్‌ఎస్ నామరూపాలు లేకుండా పోతోందని, తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీని జనం మరిచిపోతున్నారని తెలిపారు. కుట్ర, దుర్మార్గపు, మోసపూరిత, హింస ప్రేరేపిత పార్టీగా బీఆర్‌ఎస్‌ను జనం చూస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే జరగాలా?, వెనుకబడిన నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి జరగొద్దా? అని వీరేశం ప్రశ్నించారు.

గిరిజనులకు మేలు జరగొద్దని బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే దేవరకొండ బాలునాయక్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. గిరిజనులపైన దాడి చేయిస్తే కేటీఆర్ సమర్థించారని ఆరోపించారు. అచ్చంపేటలో గిరిజన ఆడబిడ్డను చెట్టు కట్టేసి కొట్టిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.

కేటీఆర్ పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరన్నారు. బందిపోట్లులా తెలంగాణను బీఆర్‌ఎస్ నేతలు దోచుకున్నారన్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి సెంటు స్థలం కేటాయించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.