అప్పుల బాధతో ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య
బెట్టింగ్‌లకు అలవాటుపడిన తండ్రి
ఎకరం అమ్మినా తీరని అప్పులు
కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బెట్టింగ్‌లకు అలవాటుపడి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి, తానూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
నందివాడ గ్రామానికి చెందిన అపర్ణతో బాసర సమీపంలో ఉన్న నయగావ్ గ్రామానికి చెదిన శ్రీనివాస్‌రెడ్డి (32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్‌రెడ్డి ఇల్లరికం వచ్చి నందివాడలోనే ఉంటున్నాడు. వారికి విగ్నేష్(7), అనిరుధ్(5) సంతానం. కొన్ని రోజులుగా బెట్టింగ్‌లకు అలవాటుపడిన శ్రీనివాస్‌రెడ్డి అప్పులు చేస్తూ వచ్చాడు.
దీంతో ఎకరం భూమి అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో పూట గడవని పరిస్థితి కుటుంబంలో నెలకొంది. దసరా పండుగ రావడంతో శనివారం ఇంట్లో కొత్త బట్టల విషయంలో అత్తమామా, భార్య అపర్ణతో గొడవ జరిగింది.
దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి.. తన పిల్లలు విగ్నేష్, అనిరుధులను పాల పిట్టను చూసేందుకు అని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలోని ఓ బావిలో తన కుమారులను మొదటగా పడేసి, తర్వాత తాను దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.