తిరుప్పావై సిరినోము- 5
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్ (తమిళ)
గోదా గోవింద గీతం
మాయల అంతర్యామి ఉత్తర మధురలో కృష్ణుడై పుట్టినట్టి
దేవకీ వసుదేవ పూర్వపున్నములు నిండిన పసిడి పంట,
మలయానిలముల తిరిగి సోలెడు యమునా విహారి వేణుధరుడు
యాదవకులరత్న దీపకుండు, గోపాలవీర యదు నందనుండు
యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి
రాగరంజితమనోసుమాల నర్చించ పునీతమై వచ్చినాము
చీకట్లు తొలగించు కృష్ణలీల, కట్లు తెంచు కృష్ణ ధ్యానము
పాపాల దూదిరాశిని బూదిచేయుకృష్ణనామమే మాకు శరణు(తెలుగు)
మాయనై= ఆశ్చర్యకరమైన, మన్ను= ఎల్లప్పుడు భగవత్సంబంధం గలవాడైన, పెరునీర్ = మహాజల ప్రవాహముగల, యమునైత్తుఱైవనై= యమునా నదీ, వడమదురై మైందనై= ఉత్తర మధురానగర నాయకుడైన, తూయ= పరిశుధ్ధ తీరమున ఉండేవాడు, ఆయర్ కులత్తినిల్= గోపవంశంలో, తోన్ఱుం= ప్రకాశిం చిన, మణి విళక్కై= మణిదీపమైన వాడిని, తాయై క్కుడల్= తల్లి యశోద కడుపున, విళక్కం శెయ్ద= ప్రకాశంప చేసిన, దామోదరనై= దామోదరుని, తూయోమాయ్= పరిశుద్ధులమై, వందు= వచ్చి, నాం తూ= పవిత్రమైన, మలర్= పూలను, తూవి= అక్రమముగా విసిరి, త్తొళుదు= సేవించి, వాయినాల్ పాడి= నోటితో పాడి, మనత్తినాల్= మనస్సుతో, శిందిక్క= చింతించి, ధ్యానం చేసి, పోయ పిళైయుం= ముందటి పాపములున్నూ, పుగుదురువాన్ నిన్ఱనవుం= మునుముందు రాబోయే పాపములను, తీయనిల్= నిప్పులో, తూశాగుం= దూదిగా కాలిపోతుంది, శేప్పే= పరమాత్ముడిని నామాములను కీర్తించే, లోర్ ఎమ్బావాయ్= మావ్రతము.
మనం తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేశాం. పోయిన జన్మలలో చేసిన పాపాలెన్నో తెలియదు. మంచి పనులు చేయడానికి ఆటంకాలెన్నో. ఓ సరస్సులో తామరపూవుపై తుమ్మెద వాలింది. సాయంకాలం గడిచిపోతున్న విషయం గమనించలేదు. పద్మం మూసుకుపోయి లోపలే బందీ అయింది. సరే, రాత్రి గడిచి తెల్లవారగానే సూర్యుడు ఉదయిస్తాడు. పద్మము వికసిస్తుంది. ‘తాను విడుదలై స్వేచ్ఛగా వెళ్లిపోతాను కదా’ అని నిశ్చింతగా నిద్రపోయిందట.
కానీ, అంతలోనే ఒక ఏనుగు సరస్సులో జొరబడి తామర తూండ్లను తొండంతో తెంపి విసిరికొట్టింది. పద్మం తెరుచుకోనే లేదు. ‘దైవం అనుకూలం గా లేకపోతే మన ప్రయత్నం ఫలించదు కదా’ అని గోపికలు ఆందోళన పడుతున్నారు.
భగవదవతారాలతో విరాజిల్లిన ఉత్తర ప్రాంతం. అందులో మధురా నగరం. ఆ నగరాధీశుడు, లీలా మానుష విగ్రహుడు, యమునా తీర విహారి, గోప కులాలంకార దీపకుడు, తల్లి యశోద మాటకు కట్టుబడి ఆమె కట్టిన తాడుకు బందీ అయిన దామోదరుడు. పవిత్రులమై వచ్చి, మంచి పూలతో పూజించి, చేతులారా సేవలు చేసి, కీర్తనలు పాడి, మనసారా ధ్యానిస్తే చాలు మన పూర్వసంచిత పాపరాశి, రాబోయే ఆగామి పాప రాశి అంతా అగ్నిలో పడిన దూదివలె బూడిదై పోతుంది, ఆ భగవన్నామమే పాడదామని అంటున్నారు గోపికలు.
మాయ అంటే ఆశ్చర్యకరమైన లీల. భగవంతుడి లీల. మాయావి అంటే శ్రీ కృష్ణుడు. ఆయన గురించి చెప్పినా, చూసినా, విన్నా ఆశ్చర్యంగానే ఉంటుంది. పరమ పదంలో ఉండేవాడు మధురలో పుట్టాడు. వైకుంఠం వదిలి వ్రేపల్లెలో పెరిగాడు. మధురలోనే సిద్ధాశ్రమం ఉంది. అక్కడే వామనుడై హరి వెలిసాడు. లవణాసురుడిని చంపిన శతృఘ్నుడు మధుర రాజధానిగా పాలించాడు. మధురలోనే కంసుని చెరసాలలో కృష్ణుడు పుట్టాడు.
నమ్మాళ్వార్లు, ఇతర మహర్షులు ఇక్కడ భగవన్నామాలను కీర్తించారు. అన్నమయ్య “అంత యు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ, కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును” అని వర్ణిస్తున్నాడు.
మధుర పుణ్య ప్రదేశం. పాపాలను హరించే చోటు. ఉత్తర మథుర వైకుంఠంతో సమానమైంది. భగవంతుడు తనను తాను పుట్టించుకున్న చోటు మధుర. వైకుంఠం భగవంతుడు ఉండే చోటు. మధురకు రాజధాని గా కన్నా, శ్రీ కృష్ణుడి జన్మస్థలంగానే గొప్పది. మైన్దనై అంటే బిడ్డ అనీ, రాజు అనీ, బలశాలి అయినవాడు అనికూడా అర్థం. పుట్టగానే తండ్రి సంకెళ్లు తామే వీడినట్టు చేసినవాడు, యౌవనం రాకముందే కంసుని చంపిన వీరు డు, మధురకు రాజు కాకపోయినా రాజువలె అధికారాలు కలిగిన వాడు. మాయావి మథురానాథుడైనాడు.
-మాడభూషి శ్రీధర్