calender_icon.png 6 October, 2024 | 4:22 AM

ప్రేమించట్లేదని చంపేశాడు

05-10-2024 12:09:58 AM

వీడిన మియాపూర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య మిస్టరీ

భర్తతో విడిపోయి తల్లితో ఉంటున్న స్పందన

తనను ప్రేమించాలంటూ వేధించిన స్నేహితుడు మనోజ్

తిరస్కరించడంతో కిరాతకంగా హత్య

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మియాపూర్‌లో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి స్పందన హత్యకేసును పోలీసులు ఛేదించారు. స్పందనను హత్య చేసింది ఆమె స్నేహితుడేనని విచారణలో తేలగా  శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మియాపూర్ ఇన్‌స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాలు.. దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ప్రైవేట్ ఉపాధ్యాయురాలు నమ్రత కుమార్తె.. బండి స్పందన(29) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను ప్రేమించగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో 2022లో వారి వివాహం జరిగింది.

ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. అయితే పెళ్లున యేడాదికే భర్త తనను వేధిస్తున్నాడంటూ స్పందన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ క్రమంలో స్పందన.. తన తల్లి, తమ్ముడితో కలిసి ఉంటోంది.

సోమవారం ఉదయం తల్లి పాఠశాలలో విధులకు వెళ్లగా స్పందన ఇంట్లోనే ఉంది. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ నొక్కినా, స్పందనకు కాల్ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సహాయంతో తలు పు బద్దలు కొట్టి చూడగా అప్పటికే స్పందన రక్తపు మడుగులో హత్యకు గురై ఉంది. 

ప్రేమించాలంటూ బలవంతం..

స్పందన పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో  ఆమె క్లాస్‌మెట్  మనోజ్ కూడా పనిచేసేవాడు. అయితే మనోజ్ ఎప్పటినుంచో ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. మధ్యలో ఆమెకు పెళ్లి జరగడంతో మనస్థాపానికి గురయ్యాడు. భర్తతో వివాదాలు రావడంతో స్పందన ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తల్లితో  కలిసి ఉంటుందని తెలుసుకున్న మనోజ్ ప్రేమ మళ్లీ చిగురించింది.

తనను ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. స్పందన నిరాకరించడంతో పాటు సాటి ఉద్యోగులతో స్నే హంగా ఉండటాన్ని చూసి మనో జ్ తట్టుకోలేకపోయాడు. ఆఫీస్‌లో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో స్పందనపై కోపం పెంచుకున్న మనోజ్.. గత సోమవారం ఆమె నివసిస్తున్న సీబీఆర్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి ఆమెపై తీవ్రం గా దాడి చేశాడు.

బండరాయితో మోది, స్కూడ్రైవర్‌తో విచక్షణారహి తంగా పొడిచాడు. దీంతో స్పందన అక్కడికక్కడే మృతిచెందింది. ఆధారాలన్నిటిని మా యం చేసిన అనంతరం మనోజ్ అక్కడినుం చి పరారయ్యాడు.  విచారణ చేపట్టిన పోలీసులు.. మొదట స్పందన భర్త వినయ్ కుమార్‌పై అనుమానంతో అతడిని విచారించారు. అయితే స్పందన మృతితో అతడికి ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నారు.

సీసీ ఫుటేజీ, సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్పందనను హత్య చేసింది మనోజ్ అలియాస్ బాలుగా గుర్తించారు. మనోజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.