11-03-2025 12:00:00 AM
హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఈ ఏడాది అద్భుతమనే చెప్పాలి. చిన్న హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఇద్దరు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. పవన్ కల్యాణ్, ప్రభాస్ సరసన అవకాశం దక్కించుకుని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ‘రాజాసాబ్’ చిత్రంలో తన పాత్రపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ దెయ్యం పాత్రలో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
దీనిపై అమ్మడు క్లారిటీ ఇచ్చింది. అలాగే పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించడంపై కూడా క్లారిటీ ఇచ్చింది. “నాకు సినీ నేపథ్యం లేకపోవడంతో మోడలింగ్ మోడలింగ్ రంగంలోకి వెళ్లి అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. హారర్ కామెడీగా రూపొందనున్న ‘రాజాసాబ్’లో నేను దెయ్యం పాత్ర పోషించడం లేదు. వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో నా పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ప్రభాస్ సెట్‌లో అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటాడు” అని చెప్పుకొచ్చింది. ఇక ‘హరిహర వీరమల్లు’ గురించి మాట్లాడుతూ.. “పిరియాడిక్ డ్రామా కోసం రెండున్నర నెలల పాటు గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్‌లోనూ శిక్షణ తీసుకున్నా.
పవన్ ఒక గొప్ప మేథావి. సాహిత్యంపైనా పట్టుంది. పవన్ డిప్యూటీ సీఎం కాకముందు ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఆయన అప్పుడు, ఇప్పుడు ఏమాత్రం మార్పు లేకుండా ఒకేలా ఉన్నారు” అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.