calender_icon.png 19 October, 2024 | 7:46 AM

అతడే డ్రైవర్.. అతడే డాక్టర్..!

19-10-2024 01:13:26 AM

  1. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న యువకుడికి ఊపిరి పోసిన రిటైర్డ్ కల్నల్
  2. ఐదు కిలోమీటర్లు కారులో తీసుకెళ్లి స్వయంగా చికిత్స

జనగామ, అక్టోబర్ 18(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి అటుగా వెళ్తున్న ఓ డాక్టర్ తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణం పోశారు.  లింగాల ఘణపురం మండలం నెల్లుట్లలో బ్రిడ్జి వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వడిచర్లకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తల, కాళ్లు, చేతులకు బలంగా దెబ్బలు తాకి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. అటుగా వెళ్తున్న వందలాది వాహనదారులు చూసీచూడనట్లుగా వెళ్లిపోతున్నారు. అదే సమయంలో జనగామకు చెందిన రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి పాలకుర్తికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో ప్రమాద ఘటనను చూసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని వెంటనే తన కారులో ఎక్కించుకున్నారు. సుమారు ౫ కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి స్వయంగా అతనే చికిత్స అందించారు. యువకుడిని ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మాచర్ల చెప్పారు.