13-02-2025 01:23:21 AM
జీఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శిపై కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి ఇంజినీర్ల ఫిర్యాదు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)లో పనిచేస్తున్న తెలంగాణ, ఏపీకి చెందిన మహిళా ఇంజనీర్లను సభ్య కార్యదర్శి ఆర్ అజగేషన్ వేధిస్తున్నాడని తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఐజీఈఆర్‌ఎస్) కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి ఫిర్యాదు చేసింది.
మహిళా ఇంజనీర్లు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి అనుచితంగా ఉందని వెంటనే ఆయనపై చర్యలు తీసుకునాలని టీఐజీఈఆర్‌ఎస్ అధ్యక్షుడు నూనె శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బీ గోపాల్ కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెగ్గలం ప్రకాష్ తమ ఫిర్యాదులో కోరారు.
అజగేషన్‌పై వెంటనే విచారణ జరిపి, తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా అజగేషన్‌పై గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు జీఆర్‌ఎంబీ చైర్మన్, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.