calender_icon.png 8 April, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదికొస్తే.. కన్నీళ్లగవు!

06-04-2025 12:00:00 AM

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఆందోళనలు, ఉద్యమాలు సాగుతున్నాయి. అందులో కామారెడ్డి జిల్లా  రామారెడ్డికి చెందిన పీజీ విద్యార్థి పొట్టిగారి రమేశ్ చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా ఆంధ్రా నాయకులు, వారికి వత్తాసు పలుకుతున్న వారికి కనువిప్పు కలుగాలని సూసైడ్ నోట్ రాసి 17 ఆగస్టు 2011న కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మబలిదానం చేసుకొన్నాడు.

తెలంగాణ మలిదశ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులవి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృతంగా పర్యటిస్తూ జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్న రోజులు. తెలంగాణ సాధించుకునే వరకు ఉద్యమాన్ని వదిలేది లేదని చెప్పిన మాటలు విద్యార్థులను బలంగా పట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలో రమేశ్ కంటే ముందే కరీం అనే యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆ ఘటన మరవకముందే.. రమేశ్ ఆత్మహత్య ఉద్యమాన్ని మరింత ప్రభావితం చేసింది. యువకుల త్యాగాన్ని చూసి అయిన ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని నాడు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. రమేశ్ అంత్యక్రియలు రామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. అంతక్రియాల్లో నాటి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కుటుంబ నేపథ్యం

రామారెడ్డికి చెందిన పొట్టిగారి సుశీల, సాయిలు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. సాయిలు నిజామాబాద్ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తూ ముగ్గురిని చదివిస్తున్నాడు. రమేశ్ అన్న విజయ్ అప్పటికి బీఈడీ పూర్తి చేశాడు. ఉద్యోగం రావడం లేదు. రమేశ్ కుడా బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి.. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో ఎమ్మెస్సీ చేస్తున్నాడు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుంది. తెలంగాణ వస్తే తమలాంటి వారికి ఉద్యోగాలు వస్తాయని తల్లితండ్రులతో రమేశ్ చెప్పేవాడు. రమేశ్ ఆత్మహత్య చేసుకునే ముందురోజు అన్న విజయ్‌తో ఉద్యమం తీరు గురించి చర్చించాడు. మనలాంటి చదువుకున్న వారికి స్వరాష్ట్రం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. బీఈడీ చదివినా ఉద్యోగాలు రాక 108లో తాత్కలికంగా ఉద్యోగం చేయాల్సి వస్తుందని అన్నతో చెప్పాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అన్నకు ఫోన్ చేసి మాట్లాడాడు. తెలంగాణ వచ్చే అవకాశం ఉన్న ఢిల్లీలో ఆంధ్రోళ్లు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెల్లవారుజామున కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మబలిదానం చేశాడు. 

-మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, విజయక్రాంతి, కామారెడ్డి 

ఉద్యోగాలొస్తాయని..

నా కొడుకు చిన్నప్పటి నుంచే చదువులో హుషారుగా ఉండేవాడు. అన్నదమ్ముళ్లు ఇద్దరు కలిసి చదువుకునేది. పెద్ద చదువు చదువుతున్నామని చెప్పేవాడు. అన్నదగ్గరికి కామారెడ్డికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేశ్ కామారెడ్డిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదు. చెట్టంత కొడుకు తమ కళ్ల ముందే చనిపోవడం యాదికొస్తే కంట్లో నీళ్లు ఆగవు.. నిద్రపట్టదు. ఇంట్లో అందరికంటే ఎక్కువ ధైర్యవంతుడు రమేశే. ఏ ఇబ్బంది వచ్చినా బయపడవద్దని చెప్పేటోడే రైలు కింద పడి సచ్చిపోయిండు. తెలంగాణ కోసం సచ్చిండని చెప్పిండ్రు. అప్పటి నుంచే నా భర్త అనారోగ్యానికి గురైండు. కొడుకు సచ్చిపోయిండని దిగులు చెందుతూ రోగం తెచ్చుకుండు. తెలంగాణ వచ్చినంక విజయ్‌కి ఉద్యోగం ఇచ్చిండ్రు. రూ.10 లక్షలు ఇచ్చిండ్రు. ఆ డబ్బులు తండ్రికి వైద్యం చెయించేందుకే డబ్బులు ఖర్చు అయినయ్. బీమారి మాత్రం పోలేదు. ఇప్పటికి ఆయనను పట్టుకొనే ఇంటిపట్టున ఉంటున్నా. ఇప్పటికి మాకు రేషన్ కార్డు లేదు. పెన్షన్ రాదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. 

- సుశీల, రమేష్ తల్లి