11-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకం వచ్చేదో చచ్చేదో తెలియదు గానీ వివిధ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేయడానికి ప్రజలు ఆన్లైన్ కేంద్రాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, తరచూ సర్వర్లు మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మీసేవ కేంద్రాలకు రావడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతోనే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనూ సంక్షేమ పథకాల దరఖాస్తు చేసుకునేందకు వివిధ రకాల ధ్రువపత్రాల కోసం మీసేవ, ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లడం నిత్యకృత్యంగా ఉండేదని, ప్రభుత్వం మారినా ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం బీసీలకు రుణాలు ఇస్తామని ఊదరగొడితే.. అనేక మంది దరఖాస్తులు చేసుకున్నా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నదని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే తంతు సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
రాజీవ్ యువ వికాసం కోసం..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగ యువత నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అనంతరం మరోసారి హార్డ్ కాపీ ఇవ్వాలంటూ మెలిక పెట్టడంతో నిరుద్యోగులు వివిధ రకాల ధ్రువపత్రాల నకిలీ ప్రతులు, ఫొటో జత చేయడానికి జిరాక్స్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు.
అటు ఆన్లైన్, ఇటు జిరాక్స్ పత్రాలు.. మరోవైపు పాన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలను పొందడానికి ఒక్కొక్కరు రూ.200 నుంచి రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఈనెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పెట్టడంతో అప్పట్లో గా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని, జిరాక్స్ పత్రాలను పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందజేయడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఫలితంగా జిరాక్స్, ఆన్లైన్, మీసేవ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు ఇస్తే సరిపోతుందని, తరువాత జిరాక్స్ పత్రాలతో కూడిన సెట్టు పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఇస్తే తప్ప దరఖాస్తులు పరిశీలించే అవకాశం లేదని అధికారులు ప్రకటించడంతో ప్రభుత్వ వ్యవహారం పూటకో తీరుగా మారిందని విమర్శలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆటంకం
రాజీవ్ యువ వికాసానికి తొలుత వివిధ ధ్రువపత్రాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల ఆన్లైన్ సర్వర్ మొరాయిస్తుండడంతో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో దరఖాస్తు అప్లోడ్ చేయడానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది.
సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో దరఖాస్తులను త్వరితగతిన ఆన్లైన్ చేయడానికి ఇబ్బందవుతున్న కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో దరఖాస్తులు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.