calender_icon.png 23 January, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.17,667 కోట్లు

23-01-2025 01:45:13 AM

2.3 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో నంబర్‌వన్ ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిరుత్సాహకరమైన ఫలితాల్ని ప్రకటించింది. రుణ వృద్ధి మందగించడంతో 2024 డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికరలాభం కేవలం 2.3 శాతం పెరిగి రూ. 17,657 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికరలాభం మాత్రం అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రూ. 26,820 కోట్ల నుంచి రూ. 16,372 కోట్లకు తగ్గింది.

బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.81,270 కోట్ల నుంచి రూ. 87,460 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 7.7 శాతం వృద్ధితో రూ. 30,650 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ స్థిరంగా 3.43 శాతం వద్ద నిలిచింది. వడ్డీ యేతర ఆదాయం 2.8 శాతం పెరిగి రూ. 11,450 కోట్లుగా నమోదయ్యింది.

బ్యాంక్ రుణ వృద్ధి 6.6 శాతానికి పరిమితమయ్యింది. బ్యాంక్ తన మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో విలనమైనప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ స్థిరంగా ఉన్నదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ శ్రీనివాసన్ వైద్యనాథన్ మీడియాకు తెలిపారు. తమ బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టపర్చేందుకు బ్యాంక్ ఉద్దేశపూర్వకంగానే రుణ వితరణలను తగ్గించుకున్నదని వెల్లడించారు. స్ధూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే వేగవంతమైన వృద్ధి సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

సీడీ రేషియోను 90 శాతం లోపునకు తగ్గించడానికి రెండేండ్లు పట్టిందని తెలిపారు. తమ మాతృసంస్థ ముఖ్య సాధనమైన గృ భ రుణాలు 9.7 శాతం వార్షికంగా వృద్థి చెందాయన్నారు. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లు 15 శాతం పెరిగాయని సీఎఫ్‌వో తెలిపారు. వ్యవసాయ రుణాల కారణంగా స్థూల మొండిబకాయిలు 1.42 శాతానికి పెరిగినప్పటికీ, పరిమాణంలో రూ. 6,400 కోట్ల వద్ద స్థిరంగా ఉన్నాయన్నారు.

వ్యవసాయ రుణాల ఎన్‌పీఏలు 1.19 శాతం మేర ఉన్నాయన్నారు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు వంటి అన్‌సెక్యూర్డ్ రుణాలపై బ్యాంక్ ఎటువంటి ఇబ్బందులనూ ఎదుర్కోవడం లేదని వివరించారు. ఈ మూడు పోర్ట్‌ఫోలియోలు స్థిరంగా ఉన్నాయని, అన్‌సెక్యూర్డ్ రుణాలు 2022 19 శాతం ఉండగా, ఇప్పుడవి 10 శాతనికి తగ్గాయన్నారు. డిసెంబర్ చివరినాటికి బ్యాంక్ కేపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) 20 శాతంగా ఉన్నది. 

సబ్సిడరీల పనితీరు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సబ్సిడరీలైన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెన్ రూ. 470 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రూ. 640 కోట్ల చొప్పున నికరలాభాల్ని ఆర్జించాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 1.42 శాతం పెరిగి రూ. 1,665 వద్ద నిలిచింది.