calender_icon.png 3 April, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూమిని కాపాడాలి!

02-04-2025 01:01:53 AM

  1. ఆ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీవే
  2. వేలం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కితీసుకోవాలి
  3. రాజ్యసభలో భూముల అంశాన్ని లేవనెత్తిన ఎంపీ డా.కే లక్ష్మణ్ 
  4. లోక్‌సభలోనూ భూముల విషయాన్ని ప్రస్తావించిన బీజేపీ ఎంపీలు
  5. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర విద్యాశాఖ, అటవీశాఖ మంత్రులకు వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెం దిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభు త్వం అమ్మేందుకు ప్రయత్నించడాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్  తీవ్రంగా ఖం డించారు. మంగళవారం రాజ్యసభలో అం శంపై ఆయన మాట్లాడారు.. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి 1974లో విద్య, పరిశోధనల కోసం ఈ 400ఎకరాల భూమి కేటాయించబడిందన్నారు.

ప్రభుత్వాలు అనే క సందర్భాల్లో విశ్వవిద్యాలయ భూములను ఇతర ప్రాజెక్టుల కోసం తీసుకుపోయాయని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఆరోపించిందన్నారు. ఐఐఐటీ క్యాంపస్, గచ్చిబౌలి స్టేడి యం, హెచ్‌సీయూ బస్‌డిపో వంటి ప్రాజెక్టుల కోసం విశ్వ విద్యాలయ భూములు తీసుకున్నట్లుగా పేర్కొందని లక్ష్మ ణ్ వెల్లడించారు. హెచ్‌సీ యూ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిలిపి వేయాలని కోరారు. 

లోక్‌సభలో..

హెచ్‌సీయూ భూములు వ్యవహారాన్ని లోక్‌సభలో జీరో అవర్‌లో బీజేపీ ఎంపీలు లేవనెత్తారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్రమంత్రులను కలిసిన ఎంపీలు 

సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిలో రాష్ర్ట ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా పెద్దఎత్తున పొక్లెయినర్లను మో హరించి రెండు రోజులుగా చేపట్టిన ఆక్రమ ణ పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అ ర్వింద్, గొడం నగేశ్..

కేంద్ర విద్యాశాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. యూనివర్సిటీ భూముల ఆక్రమణను వెంటనే నిలిపివేసి, అక్కడి పర్యా వరణ పరిరక్షణపై అధ్యయనం చేయడానికి, ఇతర ప్రత్యామ్నా య మార్గాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని టీ బీజేపీ ఎంపీలు కోరారు. హెచ్‌సీయూ ప్రస్తుతం స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోందని..

ఇలాంటి సమయంలో భవిష్యత్ తరాల కోసం అవసరమైన పచ్చని వాతావరణం, అభివృద్ధి ప నులకు, పరిశోధనలకు, యూనివర్సిటీ విస్తరణకు భూములు అవసరమని కేంద్రమం త్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ర్ట ఎంపీలతో అన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూముల బదలాయింపునకు రాష్ర్టపతి చేత ఆరుగురు సభ్యులచే నియమించబడిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తన ప్రకటనలో తెలియజేశారని ఆయన ఎంపీలకు తెలిపారు. 

తక్షణమే నివేదిక పంపండి: అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్ 

కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జి.నగేశ్, రఘునందన్‌రావు తదిత రులు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన భూపేంద్ర యాదవ్ నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హెచ్‌సీయూ భూముల వేలం ప్రక్రియను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌కు మద్దతుగా 22,000 మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ మొదలుకొని అనేకమంది పర్యావరణ, జంతుప్రేమికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు, సమీప నివాసితులు పదే పదే విజ్ఞప్తి చేసినా వినకుండా, రాష్ర్ట ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు.

వందలాది యూనివర్సిటీ విద్యార్థుల మీద అమానుషంగా లాఠీచార్జ్ చేసి, అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బనాయించడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన స్పందించకుండా ప్రకృతి విధ్వంసానికి దిగడం దారుణం అన్నారు. 

వేలాన్ని ఆపండి: ఎంపీ డీకే అరుణ

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఎవరికోసం ఈ భూములను వేలం వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.. విద్యాసంస్థకు చెందిన భూములను మీ స్వార్థం కోసం అమ్ముకుంటారా అని ప్రశ్నించారు. ప్రజల కోసం కాకుండా సీఎం సొంత లాభం కోసం భూములను వేలం వేస్తున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్ అధిష్ఠానానికి కప్పం కట్టేందుకే?: ఎంపీ ఈటల

హెచ్‌సీయూ భూములు అమ్ముకొని ఢిల్లీకి కప్పం కట్టే నీచమైన ప్రయత్నం రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్నదని.. దీనిని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇది హెచ్‌సీయూకు సంబంధించిన భూమి అని.. ఈ భూమిని కాంక్రీట్ జంగిల్ గా మారిస్తే పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు..

ఎంపీలమంతా పర్యావరణ మంత్రిత్వశాఖను కూడా కలుస్తామని...దీనిపై నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం భూములు అమ్మట్లేదని.. 400 ఎకరాల భూమి విలువ రూ.40 వేల కోట్లని..

ఆ భూములు అమ్మి కాంగ్రెస్ అధిష్ఠానానికి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కండ్లల్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని హెచ్చరించారు. పోలీసులు, బుల్డోజర్లు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయా అని ఈటల ప్రశ్నించారు.

400ఎకరాలు అటవీశాఖ పరిధిలోనివే: కేంద్రమంత్రి బండి 

రాష్ర్ట ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూములు అటవీ పరిధిలోకి వస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేరని, దానికి పలు సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు.

400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. అందుకే ఆ భూములను వేలం వేయడం కుదరదన్నారు.

ఈ విషయం తెలిసి కూడా రాష్ర్ట ప్రభుత్వం భూముల చదును పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.