14-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూములపై రూ.10వేల కోట్ల రుణం పొందేందుకు రూ.170 కోట్లు కమీషన్‌గా ఇచ్చారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
హెచ్‌సీయూ భూములను టీజీఐఐసీకి కట్టబెట్టి సదరు కార్పొరేషన్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి బాండ్స్ రూపంలో అప్పు తెచ్చింది వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూములపై మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడారని అన్నారు.
ప్రభుత్వమే నేరుగా రుణాలు తీసుకుంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుందని అలా కాకుండా ఉండేందుకే టీజీఐఐసీ ద్వారా ఈ తతంగం నడిపించారని తెలిపారు. ఇటీవలే రూ.2 వేల కోట్లను బాండ్స్ ద్వారా లోన్ తీసుకున్నారని ఆరోపించారు. 400 ఎకరాల భూమి విషయంలో ఒక బీజేపీ ఎంపీ ఉన్నారన్న కేటీఆర్.. ఆయనెవరో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. బీజేపీ చేస్తున్న పోరాటాలను చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని ఏలేటి విమర్శించారు.