03-04-2025 11:53:07 PM
పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) భూములు ప్రభుత్వం యూనివర్సిటీకి అప్పగించి, యూనివర్సిటీ పేరున రిజిస్ట్రేషన్ చెయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ నారాయణ రావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... ఆ భూములను స్వాధీన పర్చుకోవాలనే ఆలోచనలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
విద్యార్థులపై బనాయించిన ఆక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నారు. విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహం, లాఠీచార్జి చేయడాన్ని ఖండించాలన్నారు. హెచ్‌సీయూ భూములను, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక హక్కుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిఎం.రాజు, రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.