04-04-2025 01:43:19 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను ఆపేయాలంటూ గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో యూనివర్సిటీ విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు తమ పోరాటానికి దక్కిన తొలి విజయంగా పేర్కొంటూ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు.
యూనివర్సిటీలో డప్పుల దరువులతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఏబీవీపీ, పలు విద్యార్థి సంఘాల నేతలు మరోసారి హెచ్‌సీయూను ముట్టడించారు. దీంతో హెచ్‌సీయూ రెండో గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంచ గచ్చిబౌలి భూముల ను పరిరక్షించాలని కోరారు.
రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ కాంగ్రెస్ సర్కారుపై విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపు లాట జరిగింది. పలువురు విద్యార్థి నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.
పీహెచ్‌డీ విద్యార్థి ఆమరణ దీక్ష
భూముల వేలాన్ని ఆపాలంటూ హెచ్‌సీయూకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి యుగంధర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగా రు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి హెచ్‌సీయూ మెడికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో యుగంధర్‌కు హెచ్‌సీయూ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యుగంధర్ ఆరో గ్యం గా ఉన్నాడని నిర్ధారించి నిరాహార దీక్షకు అనుమతినిచ్చారు. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రావడంతో పీహెచ్‌డీ విద్యార్థి తన దీక్షను విరమించుకున్నారు.
హెచ్‌సీయూకు హైకోర్టు రిజిస్ట్రార్
హెచ్‌సీయూలో జరుగుతున్న ఆందోళనలు, చెట్ల నరికివేతకు సంబంధించి అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులపై మధ్యాహ్నం 3:30 గంటల వరకు నివేదిక ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు.
వామపక్ష విద్యార్థుల సంఘాల చలో సెక్రటేరియెట్
హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపాలని, ఓయూలో ఆందోళనలను నిషేధిస్తూ వర్సిటీ అధికారులు ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ(వీ) సంఘాలు చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సచివాలయానికి నాలుగు దిక్కు లా పోలీసులు భారీగా మోహరించారు. సెం ట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
ఉదయం ట్యాం క్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కు విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. అక్కడి నుంచి సెక్రటేరియట్ వైపు దూసుకెళ్లారు. వీరిని అడ్డుకున్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు మహేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ తదితరులు ఉన్నారు.
ముందస్తు అరెస్టులు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఉదయ్ సహా పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సచివాలయ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేట్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కమిటీ కార్యదర్శి నెల్లి సత్యం మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములను, ఓయూలో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.