న్యూఢిల్లీ, జనవరి 21: ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేసింది. 3.20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో 5,000 ఉద్యోగులకు స్థానం కల్పించగల కొత్త సెంటర్‌ను హైదరాబాద్ హైటెక్‌సిటీలో ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్ టెక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హైటెక్, లైఫ్ సైన్సెన్స్, ఫైనా న్షియల్ సర్వీసుల రంగాల్లోని తమ గ్లోబల్ క్లయింట్లకు క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ ద్వారా అందిస్తామని కంపెనీ వివరించింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ నుంచి ఈ సెంటర్‌కు గోల్డ్ సర్టిఫికేషన్ లభించిందని తెలిపింది.
హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన నిపుణులు లభించే హైదరాబాద్ తమకు కీలక ప్రాంతమని కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ తెలిపారు. 2007 నుంచి హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్‌తో ఈ నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సెంటర్ల సంఖ్య 8,500 సీట్ల సామర్థ్యంతో ఐదుకు చేరుకుంది.