13-07-2024 12:18:32 AM
న్యూఢిల్లీ, జూలై 12: దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే దేశంలో 3వ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ క్యూ 1 ప్రదర్శన అదరగొట్టిం ది. 2024 ఏప్రిల్ త్రైమాసికంలో తమ నికరలాభం 20.4 శాతం వృద్ధితో రూ. 4,257 కోట్లకు పెరిగినట్టు హెచ్‌సీఎల్ టెక్ శుక్రవారం ప్రకటించింది. అలాగే ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయం 35 శాతం వృద్ధిచెందవచ్చంటూ గైడెన్స్‌ను వెల్లడించింది.
రానున్న త్రైమాసికాల్లో మంచి వృద్ధి సాధిస్తామన్న విశ్వాసాన్ని కంపెనీ ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. తాజాగా ముగిసిన క్యూ1లో కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 6.6 శాతం వృద్ధితో రూ. 28,057 కోట్లకు చేరింది. అయితే 2024 మార్చి క్వార్టర్‌కంటే 1.6 శాతం తగ్గింది.
క్యూ1లో ఆదాయం, స్థూలలాభం తమ అంచనాల్ని మించాయని హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయ్‌కుమార్ చెప్పారు. ఈ త్రైమాసికంలో 2 బిలియన్ డాలర్ల టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ (టీసీవీ)తో కొత్త ఆర్డర్లను సంపాదించామన్నారు. క్లయింట్లు జెన్ ఏఐ, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలపై వ్యయపరుస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ రెవిన్యూ గైడెన్స్‌ను సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
8,000కుపైగా తగ్గిన ఉద్యోగులు
హెచ్‌సీఎల్ టెక్ క్యూ1లో తన ఉద్యోగుల సంఖ్యను నికరంగా 8,080 మేర తగ్గించుకున్నది. దీనితో కంపెనీ రోల్స్‌లో మొత్తం ఉద్యో గుల సంఖ్య 2,19,401 వద్ద నిలిచింది. ఈ మార్చి త్రైమాసికంలో మాత్రం 2,725 మంది ఉద్యోగులు పెరిగారు. 2024 మార్చి క్వార్టర్లో మొత్తం అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గగా, హెచ్‌సీఎల్‌లో నికరంగా పెరిగారు.
‘భవిష్యత్‌కు పోర్ట్‌ఫోలియోతో రెడీగా ఉన్నాం. జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అవకాశాల్ని అందిపుచ్చుకుంటాం’ మల్హోత్రా చైర్‌పర్సన్, హెచ్‌సీఎల్ టెక్