08-02-2025 12:46:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వ మని, అందుకే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తాము ఉద్యోగ కల్ప నకు పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాపోయారు.
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ భూసేకరణ పనులను అడ్డుకోలేదని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిం చామన్నారు. రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సెంటిలియాన్ నెట్‌వర్క్స్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడమే తమ సర్కార్ లక్ష్యమన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటిలియాన్ సంస్థ తొమ్మిది దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్‌వేర్, టెలీ కమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సంబంధించి పలు రంగాల్లో సేవలు అందిస్తోందని చెప్పారు.
తాజాగా మరో రూ.500 కోట్లు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు వెల్లడించారు. ఫలితంగా ఈ ఏడాది 500 మం దికి, మూడేళ్లలో మొత్తం 2 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయ్..
ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తమకు రాజకీయాలు కంటే .. రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వం తీసుకున్న పాలసీలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఐటీ రంగంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగాలను కల్పించాలనే సంకల్పంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొనారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు. వీరికి రావాల్సిన ప్రోత్సాహాకాలు రూ.4,500 కోట్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి రాగానే వాటిని చెల్లిస్తూ వస్తున్నామని చెప్పారు. సహేతుక కారణాలు చూపకపోతే గతంలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
ఇతర అవసరాలకు భూములను వినియోగిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్‌పై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, గతేడాది దావోస్‌లో చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 పట్టాలెక్కాయన్నారు.
10 ఒప్పందాల పురోగతి 50 శాతం కంటే ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మేం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సెంటిలియాన్ నెట్ వర్క్స్ చైర్మన్, ఎండీ వెంకట్, డైరెక్టర్ రాధా కిశోర్, ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
యూజీసీ ముసాయిదాపై కేరళలో మరో భేటీ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
వైస్ చాన్సలర్ల నియామకంలో రాష్ట్రా ల ప్రాతినిధ్యం లేకుండా అధికారాలను పూర్తిగా తమ చేతిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఉన్నత విద్యపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యూజీసీ ముసాయిదా -2025 ను ఉపసంహరించుకునే వరకు తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
యూజీసీ నూతన ము సాయిదాకు వ్యతిరేకంగా త్వరలో కేరళలో మరోసారి సమావేశం కానున్నట్టు చెప్పారు. ఈ అంశంపై రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలో డీఎంకే నేతలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ముసాయిదాలో మార్పులు చేయడం లేదా ఉపసంహరించుకునే వరకూ తాము ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.
ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం రాష్ట్ర అధికారాలను లాక్కోవాలని చూడ టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జమ్మూకశ్మీర్ కూడా తమతో కలిసి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు దుద్దిళ్ల వివరించారు.
డిగ్రీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ప్రవేశపరీక్ష నిర్వహించాలనుకోవడం విద్యార్థులను కళాశాల విద్యకు దూరం చేసే ప్రయత్నమన్నారు. ప్రవేశపరీక్ష లాంటి నిబంధన వల్ల ఉత్తీర్ణులు కాలేమన్న ఆందోళనతో మరింత ఎక్కువ మంది ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని మంత్రి వెల్లడించారు.