న్యూఢిల్లీ: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాజీ సారథి ఎంఎస్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి, తనకు మాటల్లేవని.. తాము స్నేహితులం కాదని పేర్కొన్నాడు. ‘నేను ధోనీతో మాట్లాడను. మా ఇద్దరి మధ్య గత పదేళ్లుగా మాటల్లేవ్. అయితే ధోనీతో నాకు సమస్య లేదు. కానీ అతనే నాతో మాట్లాడడం లేదు. దానికి కారణాలేంటనేది ఇప్పటికీ తెలియదు.
ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున కలిసి ఆడినప్పుడు మాట్లాడినప్పటికీ మైదానం వరకే పరిమితమయ్యాం. నాతో స్నేహంగా ఉండేవాళ్లతో ఎక్కువగా టచ్‌లో ఉంటాను. సంబంధం అనేది ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి మనం కూడా అదే ఆశిస్తాం. కానీ ఎదుటి వ్యక్తి నుంచి స్పందన లేకపోతే మనకు అలాంటి సంబంధాలు అనవసరం’ అని చెప్పుకొచ్చాడు. ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో హర్భజన్ సభ్యుడిగా ఉన్నాడు.