calender_icon.png 24 October, 2024 | 9:53 PM

ఏసీబీ వలలో హవేళీఘణపురం ఎస్‌ఐ

09-07-2024 03:51:46 AM

  • ఇసుక టిప్పర్ వదిలేసేందుకు రూ.30 వేలు డిమాండ్ 
  • మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

మెదక్, జూలై 8 (విజయక్రాంతి) : ఇసుక టిప్పర్ కేసు విషయంలో మధ్యవర్తి ద్వారా ఓ ఎస్సై లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా హవేళీ ఘణపురం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అరవింద్ గౌడ్ గతనెల 29న ఓ వ్యక్తికి చెందిన ఇసుక టిప్పర్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు. అయితే, కేసు నుంచి విడిపించేందుకు సదరు వ్యక్తి నుంచి ఎస్సై అర వింద్‌గౌడ్ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు.

దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం రూ.20 వేల నగదును ఎస్సైకి ఇవ్వడానికి రాగా మస్తాన్ అనే మధ్యవర్తికి ఇవ్వాలని సూచించాడు. దీంతో మస్తాన్ బోధన్ రహదారి వైపు సదరు వ్యక్తిని తీసుకెళ్లి లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం హవేళీ ఘణపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.