calender_icon.png 15 November, 2024 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీలను ట్రాక్టర్లతో తొక్కించిన సంగతి మరిచారా?

15-11-2024 12:57:03 AM

  1. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది మీరు కాదా?
  2. మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆత్మహత్యలకు బాధ్యలెవరు?
  3. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కుట్ర
  4. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ గుండాల దాడి
  5. మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేయించిందని, తమ ఇసుక దందాకు అడ్డొస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో ఎస్సీలను ట్రాక్టర్లతో తొక్కించారని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పలువురిపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేశారని గుర్తుచేశారు. 2021 జూన్‌లో వేములఘాట్ గ్రామానికి చెందిన రైతు తూటుకూరి మల్లారెడ్డి కూల్చివేసిన తన ఇంట్లోని కట్టెలను చితిగా మార్చుకొని, తనకు తానే ఆత్మార్పణ చేసుకున్నాడని గుర్తుచేశారు. మల్లన్న సాగర్‌ను వ్యతిరేకించిన రైతులనూ ఇబ్బందికి గురిచేశారన్నారు.

వారిలో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలు వీధిన పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే అమాయకులైన రైతులను బీఆర్‌ఎస్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. రైతులు నష్టపోయేలా చేయాలన్నది సర్కారు ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం కుట్రపూరితంగానే కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి జరిగిందని, రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ గూండాలు దాడికి పాల్పడ్డారని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు.  వారి సమస్యలను విని, పరిష్కరించేందుకే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించతలపెట్టామని తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను సైతం కాపాడుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం 11 నెలలుగా ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నదన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.