20-03-2025 01:06:40 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భారీ బహి రంగ సభ ఏర్పాటు చేసి రాహుల్‌గాంధీ కృతజ్ఞతలు తెలుపాలన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొం దడంతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలతో కలిసి.. మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల న్యాయమైన హక్కు అని, ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే మొదటగా స్పందించిందని తానేనని, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా షమీమ్ అక్తర్‌తో ఏకసభ్య కమిషన్ వేయగా 199 పేజీలతో ఓ నివేదిక ఇచ్చారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదన విపిపించామన్నారు. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామన్నారు.
తాను జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి మాదిగలు తనను అభిమానించారని, గతంలో వర్గీకరణపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే తనతో పాటు సంపత్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్యను సభ నుంచి బయటకు పంపారని సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పినా ఏనాడు తీసుకుపోలేదని విమర్శించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తనకు మంచి మిత్రుడని, ఆయనంటే తనకు ఎంతో అభిమానమని, ఆయనతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే కృష్ణ మాదిగ తనపై కంటే కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలపై అభిమానం పెంచుకున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా వర్గీకరణ జరగలేదన్నారు.
వర్గీకరణ తేల్చేవరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ‘నేను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గాలకు న్యాయం చేయాలని బలంగా నమ్మాను. శాసనసభలో సమన్వయం చేసుకుంటూ అందరిని కూడగట్టాం. బిల్లును ఎవరు వ్యతిరేకించే సాహసం చేయలేదు.
15 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో భాగంగా గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధ్ది ఫలాలు అందని వారిని గ్రూప్-1లో చేర్చాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
అన్ని విషయాల్లో న్యాయం చేస్తున్నాం..
సీఎంగా తాను మాదిగలకు అన్ని విషయాల్లో న్యాయం చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాసర ఐఐటీకి వీసీలుగా మాదిగలను నియమించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, విద్యా కమిషన్‌తో పాటు టీజీపీఎస్సీలోనూ మాదిగలకు అవకాశం కల్పించామని సీఎం వివరించారు. తమ ప్రభుత్వం వర్గీకరణ చేసిందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి సహాయం చేసేలా పని చేయాలని, అప్పుడే మరో పది మందికి అవకాశాలు వస్తాయన్నారు.
తాను సీఎం ఉన్నంత వరకు మీ వాడే ఉన్నారనుకోవాలని చెప్పారు. తాను కేవలం పేరు మాత్రమే కోరుకుంటానని, ఈ ప్రభుత్వం మీదే.. మీ సంక్షేమం, అభివృద్దికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ‘మీ పిల్లలను బాగా చదివించండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది ’ అన్నారు. రాహుల్‌గాంధీ కోసం భారీ బహిరంగ సభ పట్టి అభినందనలు తెలపాలన్నారు. గాంధీ కుటుంబం మీ నుంచి కోరుకునేది అభినందనలు మాత్రమేనని అన్నారు.
ఇక్కడ భారీ సభను పెడితే.. రాహుల్‌గాంధీకి అభినందలు తెలపడం వల్ల మరి కొన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, పీసీసీ కార్యదర్శి ముంజగల్ల విజయ్, సతీష్‌మాదిగ, కృపాకర్ మాదిగ, పిడమర్తి రవితో పాటు వివిధ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.