calender_icon.png 21 October, 2024 | 5:18 AM

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కనండి

21-10-2024 02:04:32 AM

అలాంటి వారే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేలా చట్టం తెస్తాం

ఏపీ సీఎం చంద్రబాబు 

ఆసక్తికర వ్యాఖ్యలు 

అమరావతి, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జనాభాపై కీలక వ్యాఖ్య లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా పెరిగిపోతోందని.. దీని పర్యవసానంగా రాబోయే రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు తానే జనాభా నియంత్రణ చేయాలని చెప్పానని.. ఎక్కువ పిల్లలను కనవద్దని, సమస్యలు వస్తాయని చెప్పానని గుర్తు చేశారు. అప్పటి పరిస్థితుల నేపథ్యలో ఆ మేరకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.

ఇప్పుడు పరిస్థితి మారింది..

గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన ర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందని చంద్రబాబు తెలపారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని.. రానున్న కాలంలో జనాభా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని అలాగే.. ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ సాయం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఆంధ్రాతో సహా దక్షిణ భారతదేశంలో వృద్ధాప్య సమస్య సంకేతాలు కనిపిస్తున్నాయని.. ఇక్కడి యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో.. ప్రస్తుతం చాలా గ్రామాల్లో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉందన్నారు. ఇలాగే కొనసాగితే సమస్య పెద్దగా అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు.