నేడు లక్ష రుణమాఫీ.. మూడు విడుతలుగా పథకం అమలు
- నెలాఖరులో లక్షన్నరవరకు మాఫీ
- ఆగస్టులో రెండు లక్షల వరకు రుణమాఫీ
- నేడు సంబురాలు చేసుకోవాలని సీఎం రేవంత్ పిలుపు
- ప్రతి రైతును రుణ విముక్తుణ్ణి చేస్తాం
- గాంధీ కుటుంబం మాట శిలాశాసనమే
- హామీ అమలు చేశామని గర్వంగా చెప్పండి
- కాంగ్రెస్ నేతలకు సీఎం సూచన
- ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నేతలతో భేటీ
- కేసీఆర్ 28 వేల కోట్లు కూడా మాఫీ చేయలేదని విమర్శ
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ అమలు నేపథ్యంలో బుధవారం ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం సమావేశమయ్యారు.
2022 మే 6న వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని, ఆ హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని గుర్తు చేశారు. ‘ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం.
రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మాడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలి. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నాం’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతు రుణమాఫీ ద్వారా రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని తెలిపారు. నెలాఖరులోగా రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.
ప్రతి రైతును రుణ మిముక్తి చేయాలన్నదే లక్ష్యం
ప్రతి రైతును రుణ విముక్తుణ్ణి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదని, రైతు రుణమాఫీపై ప్రభుత్వా నికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. అందుకే ఏక మొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తున్నామని చెప్పారు. ‘మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలి.
సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలి. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ర్టం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్‌లో ఎంపీలు ప్రస్తావించాలి. గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించండి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసింది’ అని సీఎం తెలిపారు.
ఆగస్టు దాటకుండానే రుణమాఫీ: భట్టి
ఆగస్టు దాటకుండానే రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావే శంలో ఆయన మాట్లాడారు. ‘రుణమాఫీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపాం. రూపాయిరూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం. అన్ని కుటుంబాలకు రుణ మాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది. ఏ రైతుకు కూడా రుణ మాఫీ దక్కకపోవడం అంటూ ఉండదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వం. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు కాంగ్రెస్ శ్రేణులు తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని, ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలి.
మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా పూర్తి చేసింది. రూ.7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మేము రూ.2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందు లున్నా హామీలు అమలు చేస్తున్నాం. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. రుణమాఫీ పార్టీకి, నాయకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందనే విషయాన్ని గ్రామగ్రామాన ప్రచారం చేయాలి’ అని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.
11.50 లక్షల మందికి లబ్ధి
6,800 కోట్లు బ్యాంకర్లకు చెల్లింపు.. నెలాఖరులోగా 7.4 లక్షల మందికి
హైదరాబాద్, జూలై 17(విజయక్రాంతి): రైతులకు మొదటి విడత కింద రూ. లక్ష రుణమాఫీకి రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేయనుంది. మొదటి విడతలో రూ. లక్ష లోపు రుణాలను రద్దు చేయడం ద్వారా దాదాపు 11.50 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. తొలి విడుతలో మొత్తం రూ.6.800 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. రుణమాఫీ కానుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 90 లక్షలు ఉండగా.. వారిలో 70 లక్షల మందికి పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. పట్టా పాస్ పుస్తకాలు ఉండి.. రేషన్ కార్డు లేని రైతులు 6.36 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా రూ. 2 లక్షల రుణమాఫీ పథకానికి దాదాపు 40 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తొలి విడత కింద 11.5 లక్షల మందికి, ఈ నెలాఖరులోగా రెండో విడుతలో రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు 7.4 లక్షల మందికి ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇక ఆగస్టులో మూడో విడతలో రుణాన్ని రద్దు చేయనుంది.
పైన చెప్పిన గణాంలను బట్టి చూస్తే.. మూడో విడుతలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగి పోవడం వల్ల చాలా మంది రైతులు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల స్లాబులోకి వచ్చినట్లు సమాచారం. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రుణాన్ని మాఫీ చేసింది. బీఆర్‌ఎస్ సర్కారులో తీసుకున్న రుణాలను.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో చెల్లించలేదు. నాడు బీఆర్‌ఎస్ సర్కారు ఒకేసారి రుణాలను మాఫీ చేసి ఉంటే.. రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల స్లాబులోకి వచ్చే రైతుల సంఖ్య భారీగా తగ్గేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారి..
రుణమాఫీపై కలెక్టర్లకు ఏమైనా అనుమానాలు ఉంటే.. నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని సచివాలయంలో నియమించింది. రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా.. ఆయా జిల్లాల కలెక్టర్లు తమకు కేటాయించిన అధికారిని అడిగి తెలుసుకోవచ్చు.
బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం
గురువారం ఉదయం అన్ని జిల్లాల్లో బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం కానున్నారు. ఆయా జిల్లాలో పరిధిలో రుణమాఫీ నిధుల విడుదలపై చర్చించనున్నారు. ఈ నిధులను బ్యాంకర్లు దారి మళ్లించకుండా.. కలెక్టర్ల రుణమాఫీ ప్రక్రియను పర్యవేక్షించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో రైతుల కోసం విడుదల చేసిన నిధులను బ్యాంకర్లు దారి మళ్లించిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.