ఒకప్పుడు
ఆశగా చిందించే మనసుకి
చిగురించిన చెట్లు
నీడలా నడచి నేస్తమై నిలిచేవి
హృదయం ఉదయమై లేస్తే
కళ్లముందు కోటి వీణల రాగాలు
పక్షులు తమ పలుకుల్ని పల్లెలపై
మిఠాయిలా మీటి పాడేవి
ఊరిలో పారే వాగొంకలు
వలస భూతాన్ని వెక్కిరించి
మూడు పంటల్ని ముచ్చటగా అందించి
అన్నపూర్ణలా ఆదరించేవి
ఆకాశం నిలిచి నడచి కురిసి
కర్శకునికి కర్రలాగ
ఆసరాగా మారేది
సేంద్రీయ సేద్యం తెరమరుగు కాగా
రసాయన జాడ్యం
రైతు ఆర్థిక మాంద్యానికి గుదిబండలా మారి
ఆ గుండె గగుర్పాటుకు కారణ‘భూత’మవుతోంది
పండిన పంటకు ధర నిర్ణేత
రైతు కాదు
అలాగని రైతు ఆశలు పొంగి పొర్లవు
పంటలపై ఆశలు అస్సలు చావవు
సాగి, కొనసాగి అప్పుల మోపు మోయాల్సిందే
నదులు నిండాయి
అయినా రైతు మది ఉప్పొంగలేదు
నాలుగు చుక్కల నీరు
సీమ నేలపై తొంగి చూడలేదు
నిర్జీవ నేలలు ఏ పంట
కలలూ కనలేదు
ఆరుగాలం శ్రమించే రైతుకు
పంట కలలు
పీడ కలలుగానే వెక్కిరిస్తున్నాయి
ఆశలు మోసులు మొలకెత్తక
వెంటాడే జ్ఞాపకాలుగా నిలిచి వెక్కిరిస్తున్నాయి...!!
మహబూబ్ బాషా చిల్లెం
9502000415