calender_icon.png 9 October, 2024 | 6:05 AM

హర్యానాలో హ్యాట్రిక్

09-10-2024 03:00:16 AM

జమ్ముకశ్మీర్‌లో కూటమి

అనూహ్య ఫలితాలు

  1. 48 సీట్లతో హర్యానాలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ
  2. కాంగ్రెస్‌కు 37 సీట్లే!
  3. దెబ్బతీసిన వర్గపోరు.. వ్యూహాల లోపంతో జాట్లు, ఎస్సీలు దూరం

కమల వికాసం

కశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి జయకేతనం

ఎన్సీకి 42.. ఆరు సీట్లకే కాంగ్రెస్ పరిమితం

29 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా బీజేపీ

రెండుచోట్లా విఫలమైన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు

కశ్మీర్ కాబోయే సీఎం ఒమర్: ఫరూఖ్ అబ్దుల్లా

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: జాతీయ ప్రాముఖ్యం సంపాదించుకొన్న హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపిందని, పూర్వవైభవం తథ్యమని ఘోషించిన ఎగ్జిట్ పోల్స్‌కు ఓటర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు.

ముఖ్యంగా హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేక గాలిలో కొట్టుకు పోతుందన్న బీజేపీ అనూహ్యంగా అధికారాన్ని నిలబెట్టుకున్నది. అది కూడా గతం కంటే మరింత బలపడటం విశేషం. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో బీజేపీ 4౮ చోట్ల గెలుపొంది సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నది. మూడొంతుల సీట్లు గెలిచి ఇతర పార్టీలన్నింటికీ షాకిస్తుందని భావించిన కాంగ్రెస్ 3౭ సీట్ల వద్దనే ఆగిపో యింది.

జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)తో జట్టుకట్టి పోటీచేసినా కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఇక్కడ ఈ కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించినా అందులో సింహభాగం ఎన్సీనే గెలిచింది. ఇక్కడ 90 సీట్లకు జరిగిన పోలింగ్‌లో ఎన్సీ కూటమి 49 సీట్లు గెలుచుకొన్నది. ఇందులో ఎన్సీనే 42 గెలు వగా, కాంగ్రెస్ 6 సీట్ల వద్దనే ఆగిపోయింది. బీజేపీ 29 సీట్లు గెలిచి గట్టి పోటీ ఇచ్చింది.

మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో అతి విశ్వాసంతో ఎదురుదెబ్బ తిన్న బీజేపీ.. మూడు నెలల్లోనే మళ్లీ పుంజుకొని ఎన్నికల వ్యూహాల్లో తనకు తిరుగు లేదని చాటింది. రెండు రాష్ట్రాల ఎన్నికలు మంగళవారం వెల్లడయ్యాయి.

కుస్తీ బరిని వదిలి ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ పొగాట్ జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీ టికెట్ నిరాకరించటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దేశంలోనే సంపన్న మహిళ సావిత్రి జిందాల్ తన స్థానాన్ని నిలబెట్టుకొన్నారు. 

అనుకొన్నదొక్కటి అయ్యిందొక్కటి

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కూటమి అడ్రస్ గల్లంతవుతుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలన్నీ అంచనా వేశాయి. బీజేపీ అనుకూల మీడియా కూడా కాంగ్రెస్ భారీ గెలుపు ఖాయమనే చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల నాడిని పట్టలేవని మరోసారి తేలిపోయింది.

బీజేపీ గత రెండుసారి చిన్నపా ర్టీలతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, ఈసారి సొంతంగా మ్యాజిక్ మార్క్ సాధించింది. హర్యానా అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 46 సీట్లు కాగా, కాషాయ పార్టీ 4౮ స్థానాలు గెలుచుకొన్నది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. హర్యా నాలో బంపర్ మెజారిటీ ఖాయమని భావించింది.

ఎగ్జిట్‌పోల్స్ వచ్చిన మరుక్షణం నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై కూడా చర్చ మొదలైంది. తీరా ఫలితాల్లో ఆ పార్టీ చతికిల పడింది. హర్యానాలో గెలిచి త్వరలో జరుగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలని భావించిన ఆ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి.

హర్యానా ఫలితాలు వెలువడిన వెంటనే ఇండియా కూటమి మిత్రులు కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించటం మొదలుపెట్టాయి. అంతర్గత కుమ్ములాటలు, రెబల్ అభ్యర్థులే కాంగ్రెస్ కొంప ముంచాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం భూపిందర్ హుడా, దళిత నేత కుమారి షెల్జా మధ్య వర్గపోరు పార్టీని తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎన్నికల వ్యూహాలతోపాటు పార్టీ నేతల మ ధ్య సమన్వయ లోపం కాంగ్రెస్‌ను మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం చేసింది. రాష్ట్రంలో ౧౭ ఎస్సీ రిజర్వుడు స్థానాలుండగా, రాజకీయం గా బలమైన జాట్లకు అధిక ప్రాధాన్యమిచ్చింది. చివరకు అటు జాట్లు, ఇటు ఎస్సీలు కూడా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారు. 

సత్యమే గెలిచింది

పవిత్రమైన భగవద్గీత పుట్టిన హర్యానాలో సత్యమే గెలిచింది. హర్యానాలో వరుసగా మూడుసార్లు గెలిచిన పార్టీ ఏదీ లేదు. తొలిసారి బీజేపీ చరిత్ర సృష్టించింది. పార్టీ గెలుపు కోసం కృషిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు, శుభా కాంక్షలు. జమ్ముకశ్మీర్‌లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించింది.

కాంగ్రెస్ పార్టీ తనతో జట్టుకట్టిన పార్టీలన్నింటికీ ఒటమే మిగులుస్తున్నది. సొంత మిత్రులనే ఆ పార్టీ మింగేస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అర్బన్ నక్సల్స్ కలిసి పదేపదే కేసులు వేసి వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు.                     

   ప్రధాని నరేంద్రమోదీ