28-03-2025 12:00:00 AM
ఓ అత్యాచారం కేసు తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాచేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నెల 17న మిశ్రా ఈ తీర్పు ఇచ్చారు. మహిళల దుస్తులు పట్టుకుని లాగడం, ఛాతిని తాకడం అత్యాచార యత్నం కిందికి రాదంటూ తీర్పు సందర్భంగా మిశ్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవితో పాటుగా అన్ని వర్గాలకు చెందిన వాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాన్ని సరిచేయాలని కేంద్రమంత్రి కోరడంతో సుప్రీంకోర్టు గత బుధవారం దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. అలహాబాద్ జడ్జి తీర్పుపై స్టే విధించిన జస్టిస్ బీఆర్ గవాయ్.
జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం మిశ్రా చేసిన వ్యాఖ్యలు ‘పూర్తి అమానవీయం’గా ఉన్నాయంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. సదరు న్యాయమూర్తిపై తగు చర్యలు తీసుకోవాంటూ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం మిశ్రా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతో పాటుగా యూపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. గతంలో కూడా కింది కోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులను సుప్రీంకోర్టు నిలిపివేసిన సందర్భాలున్నాయి. తీర్పుల విషయంలో కింది కోర్టులు కొన్నిసార్లు పొరబాట్లు చేయవచ్చు. అయితే మైనర్ బాలికపై అత్యాచార యత్నం లాంటి సున్నితమైన కేసుల విషయంలో న్యాయమూర్తులు ఎంతో లోతుగా ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టుట అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. దేశంలో మైనర్ బాలికలపై దారుణాలు పెరిగిపోతుండడం, వీటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో మిశ్రా ఇచ్చిన తీర్పు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అత్యాచార యత్నానికి అర్థాన్నే మార్చివేసేలా ఉందన్న విమర్శలు న్యాయనిపుణుల నుంచి కూడా వెలువడుతున్నాయి. న్యాయమూర్తి హడావుడిగా తీర్పు ఇచ్చినట్లుగా కనిపించలేదని, ఘటనపై జడ్జి తన మనసుతో ఆలోచించినట్లుగా లేదని అర్థమవుతోందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో జడ్జీలు వ్యవహరించాల్సి తీరుకు ఓ హెచ్చరిక కావాలి.
మిశ్రాపై అలహాబాద్ హైకోర్టు సీజే తీసుకోబోయే చర్య భవిష్యత్తులో జడ్జిలందరికీ మార్గదర్శకం కావాలని ప్రజలు కోరుకొంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఏకీభవిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేయదగ్గ కేసులు కొన్ని ఉంటాయని, అలాంటి వాటిలో ఇదొకటని అన్నారు. ఈ తీర్పు పట్ల తాను కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని మెహతా అన్నారు. ఈ ఘటన తర్వాత కేంద్రం కూడా దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.
2021లో ఉత్తరప్రదేశ్‌లో ఓ 11 బాలికను బైక్‌పై ఇంటివద్ద దింపుతామని ఎక్కించుకున్న ఇద్దరు యువకులు ఆ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్లున్న వాళ్లు రావడంతో నిందితులు అక్కడినుంచి పారిపోయారు. ఆ బాలికను రక్షించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి నారాయణ మిశ్రా నిందితులైన పవన్, ఆకాష్‌లతో మోపిన ఆరోపణలు అత్యాచార యత్నం నేరంగా పరగణింపబడవని స్పష్టం చేశారు.
ఈ చర్యవల్ల బాధితురాలు నగ్నంగా లేదా, వివస్త్రగా మారినట్లు సాక్షులు చెప్పలేదని, అంతేకాకుండా లైంగిక దాడికి యత్నించారన్న ఆరోపణలేవీ లేవని కోర్టు తెలిపింది. దీన్ని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా మాత్రమే పరిగణించవచ్చని పేర్కొంది. అయితే ఈ తీర్పుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తీర్పు న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మహిళా మంత్రి సైతం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఈ తీర్పు ఎంతగా వివాదాస్పదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.