calender_icon.png 6 October, 2024 | 4:10 AM

హస్తానిదే హర్యానా!

06-10-2024 01:40:39 AM

  1. బీజేపీ వెనుకంజ 
  2. జమ్ముకశ్మీర్‌లో ఇండియా కూటమి ఆధిక్యం  

అంచనా వేసిన ఎగ్జిట్‌పోల్స్ 

శనివారం ముగిసిన హర్యానా 

పోలింగ్ 65.65 శాతం ఓటింగ్ నమోదు

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: జమ్ముకశ్మీర్, హర్యానా శాసనసభ ఎన్నికల ఘట్టం ముగిసింది. పదేళ్ల పాటు బీజీపీ పాలనలో ఉన్న హర్యానా, పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్ముకశ్మీర్‌లలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

హర్యానా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. జమ్ముకశ్మీర్‌లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించటం లేదని సర్వేలు తేల్చా యి. కానీ ఎన్సీ కూటమికే ప్రజల మద్దతు అధికంగా ఉందని ఎక్కువ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

హర్యానాలో మాత్రం కాంగ్రెస్ అధికారం ఖాయమని సర్వేసంస్థలు పేర్కొంటున్నాయి. అధికార బీజేపీ పదేళ్ల పాలన ముగియనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌తో పాటు హర్యానాలో హస్తం పార్టీ పూర్వవైభవం సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

కశ్మీర్‌లో రికార్డు స్థాయిలో..

జమ్ముకశ్మీర్‌లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించగా అక్టోబర్ 1న పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో జమ్ముకశ్మీర్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జమ్ము కశ్మీర్‌లోని 90 స్థానాలకు పోలింగ్ జరుగగా 63.88 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పటికే పోలింగ్ పూర్తికాగా ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరముండగా కూటమి మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందని పేర్కొంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో కలిపి 63.88 శాతం పోలింగ్ నమోదైంది.

ఘర్షణల మధ్య పోలింగ్

కొన్ని చెదురుమొదురు ఘటనలు మినహా హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మెహ మ్ సెగ్మెంట్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి బాలరాజ్ కుండు, అతని పీఏపై మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, ఆయన అనుచరులు దాడిచేశారు. హిస్సా ర్ నియోజకవర్గంలోని నార్నాడ్‌లోని పోలింగ్ బూత్ బయట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని అదుపు చేశారు. ఒకే దశలో రాష్ట్రంలోని 90 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా 6౫.౬౫ శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో భాగంగా చేసిన తనిఖీల్లో మొత్తంగా రూ.75 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 90 స్థానాలకు గాను 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.