calender_icon.png 29 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల రహిత రెవెన్యూ చట్టం

01-09-2024 12:29:20 AM

  1. కొత్త చట్టం ముసాయిదాపై ముగిసిన అభిప్రాయ సేకరణ
  2. సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం రూపకల్పన
  3. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయ్యిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇక చట్ట రూపకల్పనపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన కసరత్తును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నింటినీ ఒక దగ్గర పొందుపరచి నిశితంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.

రాష్ర్ట ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఏది అవసరమో ఆ అంశాలను కొత్త చట్టంలో ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు. మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్టుగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వివరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే, గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో అది నెరవేరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యాయని విమర్శించారు. 2020 రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉండటంతో రైతులు, భూ యజమానులు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.

ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు మరింత పెరిగాయని, దీంతో రైతులు, భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. తప్పుల తడక ధరణి వల్ల రాష్ర్టంలో దాదాపు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారని విమర్శించారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా మేధావులు, నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ప్రజా ప్రతినిథులు, రైతులు, సామాన్య ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించినట్టు తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై ఆగస్టు 2వ తేదీన శాసన సభలో చర్చించి అదే రోజు భూ పరిపాలన ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని, జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో వర్క్ షాప్‌లు కూడా నిర్వహించామని వెల్లడించారు.

జిల్లా స్థాయిలో నిర్వహించిన వర్క్‌షాప్‌లలో వచ్చిన సూచనలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే భూపరిపాలన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయని తెలిపారు. లిఖిత పూర్వకంగా, ఈ మెయిల్ ద్వారా కూడా సూచనలు, సలహాలు వచ్చాయని చెప్పారు. సామాన్యులు సైతం పలు సూచనలు చేశారని పేర్కొన్నారు. అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వివరించారు. గత ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉన్న ధరణిని తమ ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గా అందరికీ అందుబాటులో ఉంచబోతుందని అన్నారు.